సూపర్‌ లోకల్‌ మొబైల్‌ యాప్స్‌.. అదుర్స్‌! | Local Mobile Apps Help For Youth in Hyderabad | Sakshi
Sakshi News home page

సూపర్‌ లోకల్‌ మొబైల్‌ యాప్స్‌.. అదుర్స్‌!

Published Mon, Jul 27 2020 7:16 AM | Last Updated on Mon, Jul 27 2020 7:16 AM

Local Mobile Apps Help For Youth in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మియాపూర్‌లోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో నివసిస్తున్న ప్రవీణ్‌కు క్రికెట్‌ అంటే మహా ఇష్టం. కానీ తానుండే ప్రదేశంలో తనలా ఆ ఆటపై ఆసక్తి ఉన్న వారెవరో తెలియదు. తన అభిరుచులు, ఇష్టాఇష్టాలకు అనుగుణంగా ఉన్నవారితో స్నేహం చేయడం మైలో యాప్‌ ద్వారా సాధ్యపడుతుంది. నగరానికి చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ సిద్ధం చేసిన ఈ యాప్‌ను పలు గేటెడ్‌ కమ్యూనిటీల్లో వినియోగిస్తున్నారు. ఈ యాప్‌ ద్వారా ఇరుగుపొరుగు వారిని మరింత దగ్గర చేయడం, ఇష్టాఇష్టాలు, అభిరుచులు పరస్పరం పంచుకోవడం.. కష్టసుఖాలు షేర్‌ చేసుకునేందుకు ఈ యాప్‌ ఓ అవకాశం కల్పిస్తుండటం విశేషం. 

మైగేట్‌తో మరో ముందడుగు... 
గేటెడ్‌ కమ్యూనిటీల్లో స్థానికుల అవసరాలను తీరుస్తోన్న మరో యాప్‌ మైగేట్‌ మొబైల్‌ యాప్‌. ఈయాప్‌ ద్వారా ఆయా నివాస సముదాయాలకు బయటి వ్యక్తులు, మార్కెటింగ్‌ సిబ్బంది తదితరులు ఎవరు.. ఏఏ సమయాల్లో వచ్చారు..? క్యాబ్‌ సర్వీసులు ఏ సమయంలో లోనికి వచ్చాయి..? పనిమనిషి ఏ సమయంలో లోనికి ప్రవేశిస్తుంది.. తొలుత ఎవరి ఇంట్లో పనిచేస్తుంది. ఆమె తీరిక వేళలు ఏమిటి.. మీ ఇంటికి వచ్చేందుకు ఆమెకు ఏ సమయంలో వీలవుతుంది..? తదితర వివరాలన్నీ నోటిఫికేషన్స్, అలర్ట్‌ రూపంలో మొబైల్‌కు అందనుండటం సరికొత్త సమాచారం ఇచ్చినట్లవుతుంది. ఈయాప్‌లు భద్రమైనవేకాక... ఆయా పనులను సులభతరం చేస్తున్నాయని నిపుణులు సైతం చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, చెన్నై తదితర మహా నగరాల్లో సూపర్‌ లోకల్‌ మొబైల్‌ యాప్స్‌ను గేటెడ్‌ కమ్యూనిటీల్లో నివసిస్తున్న వారు విరివిగా వినియోగిస్తున్నారని.. భాగ్య నగరంలోనూ ఈ ట్రెండ్‌ ఇటీవలికాలంలో జోరందుకుందని చెబుతున్నారు. 

యాప్‌ల కాలం.. 
నెటిజనుల్లానే సిటీజనులు.. ఐటీ, బీపీఓ, కేపీఓ, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వేతనజీవులు, విద్యార్థులు, వయోధికులు, మహిళలు, చిన్నారులు, రోగులు ఇలా అన్ని వర్గాల వారికీ కోరిన సేవలు ఇంటి ముందుకు తీసుకొచ్చేందుకు మొబైల్‌ యాప్స్‌ అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. కోవిడ్‌ కలకలం నేపథ్యంలో ఆహారం, మెడిసిన్స్, వైద్యసేవలు, వైద్య పరీక్షలు, వివిధ రకాల సేవలు, షాపింగ్‌ తదితర అవసరాలను తీర్చే యాప్స్‌ అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఇప్పుడు అందుబాటులోకి  వచ్చిన సూపర్‌ లోకల్‌ మొబైల్‌ యాప్స్‌కు విశేష ప్రజాదరణ లభిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement