సాక్షి, కామారెడ్డి: ఆ ఊళ్లో అడుగు పెట్టగానే పెద్ద పెద్ద మీసాలతో ఉన్న పెద్దమనుషులు కనిపిస్తారు. యాభై ఏళ్లు దాటిన వాళ్లందరూ దాదాపు మీసం రాయుళ్లే. మీసాల గురించి ఎవరినైనా అడిగినా.. ‘మగోడు అన్నప్పుడు మీసం ఉండాలె. మీసం ఉంటేనే రోషం ఉంటది’ అనే సమాధానం వస్తుంది. ‘మా తండ్రి, తాత, ముత్తాతలు పెంచిండ్రు. మేం గూడ పెంచినం’ అంటారు.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లి కలాన్‌లో దాదాపు 100 మందికి పైనే మీసం రాయుళ్లు ఉంటారు. పది మందిలో ఏడెనిమిది మందికి కచ్చితంగా మీసాలు ఉంటాయి. మగవాళ్లకు మీసాలు ఉండాలని, ఆ దర్పం వేరేగా ఉంటుందని వారు చెబుతున్నారు. కొందరైతే నలుగురిలో నిలబడినప్పుడు మీసాలను మెలేస్తుంటారు. ఆ ఊరికి కొత్తగా ఎవరొచ్చినా మీసం రాయుళ్లను ఆసక్తిగా చూస్తారు. తాము మాత్రం బతికున్నన్ని రోజులు మీసాలను కాపాడుకుంటామని చెబుతున్నారు.
మీసం తిప్పితే ఆ సంతోషమే వేరు
తాతల కాలం నుంచి మగవాళ్లందరూ మీసాలు పెంచుతున్నారు. మా తాత నుంచి మా తండ్రికి అబ్బింది. నాకు కూడా మీసం మీద అభిమానంతోని పెంచినా. ఇప్పటికీ మీసాలను కంటికి రెప్పలా కాపాడుకుంటా. మీసం తిప్పితే ఆ సంతోషం వేరేగా ఉంటది. ఇప్పటోళ్లు మీసాలన్నీ గీకేసుకుంటున్నరు.
– కడెం లస్మయ్య
మా అన్నదమ్ములందరికీ మీసాలున్నయి
మేం ఆరుగురం అన్నదమ్ములం. అందరికీ మీసాలు ఉన్నయి. మా తాతలు, తండ్రుల నుంచి మా అన్నలు అందరూ పెంచిండ్రు. ఆళ్లను చూసి నేను గూడ పెంచిన. మీసం ఉంటే అందరూ గొప్పగ జూస్తరు. మా ఊళ్లె చానా మంది మీసాలతోనే ఉంటరు.
–బందంల అశోక్
Comments
Please login to add a commentAdd a comment