
సాక్షి, సిటీబ్యూరో: పుట్టుకతోనే తక్కువ బరువు (550 గ్రాములు)తో జన్మించి..మృత్యువుతో పోరాడుతున్న ఓ శిశువుకు మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. 140 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడారు. ప్రస్తుతం శిశువు బరువు 2.5 కేజీలకు చేరుకోవడంతో శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు చికిత్స సంబంధించిన వివరాలను ఆస్పత్రి వైద్యులు మీడియాకు వెల్లడించారు.
నెలలు నిండక ముందే సిజేరియన్ ద్వారా ప్రసవం..
నగరానికి చెందిన ఓ ఫ్యాషన్ డిజైనర్ గతేడాది నవంబర్ ఆరో తేదీన తొలి కాన్పులో భాగంగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు నెలలు నిండక ముందే నొప్పులు రావడంతో సిజేరియన్ ద్వారా బిడ్డను బయటికి తీయాల్సి వచ్చింది. 24 వారాల ఐదు రోజులకు శిశువు జన్మించింది. ఈ సమయంలో శిశువు బరువు కేవలం 550 గ్రాములే. సాధారణంగా ఇంత తక్కువ బరువుతో జన్మించిన శిశువులు బతకడం చాలా కష్టం. కానీ మెడికవర్ ఆస్పత్రికి చెందిన వైద్యులు డాక్టర్ మంజుల అనగాని, డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె, డాక్టర్ నవిత, డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్ జనార్దన్‌రెడ్డి, డాక్టర్ శశిధర్, డాక్టర్ రాకేష్‌ల నేతృత్వంలోని వైద్య బృందం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తక్కువ బరువుతో జన్మించిన శిశువును ఎలాగైనా బతికించాలని భావించారు.
ఈ మేరకు మూడు రోజుల పాటు వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందించారు. ఆ తర్వాత ఎన్‌ఐసీయూకు తరలించి సీపీఏపీతో శ్వాసను అందించారు. పుట్టిన రెండో రోజు నుంచే శిశువుకు ఐవీప్లూయిడ్స్, యాంటీబయాటిక్స్, ట్యూబ్ ద్వారా పాలు అందించారు. ఇదే సమయంలో శిశువుకు జీర్ణవ్యవస్థలో ఇన్‌ఫెక్షన్ వచ్చింది. ఫీడింగ్ ఆపేసి..యాంటిబయా టిక్ డోస్‌ను పెంచారు. శిశువు కోలుకున్న తర్వాత నేరుగా పాలు పట్టడంతో పాటు సీపీఏపీ ప్రక్రియను నిలిపివేసి, స్వయంగా శ్వాసతీసుకునే విధంగా చేశారు. ప్రస్తుతం శిశువు 2.5 కేజీల బరువు పెరిగింది. శ్వాస తీసుకోవడంతో పాటు స్వయంగా పాలు తాగుతుంది. గతంతో పోలిస్తే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. దీంతో శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. చికిత్సకు రూ.20 లక్షలకుపైగా ఖర్చు అయినట్లు ఆస్పత్రి వర్గాల తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment