సాక్షి, హైదరాబాద్: నిజాం కాలేజీలో హాస్టల్ భవనం కేటాయింపు విషయంలో విద్యార్థినిలు కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. ‘విద్యార్థులు చేస్తున్న ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాను. సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, నేను కూడా మాజీ నిజాం కాలేజీ విద్యార్థులమే. ఇక్కడ హాస్టల్‌లో ఉండి మేము చదువకున్నవారిమే. అందువల్ల మీ ఇబ్బందులు, కష్టాలపై మాకు పూర్తి అవగాహన ఉంది. విద్యార్థులకు హాస్టల్ చాలా అవసరం అందులోనూ మహిళా విద్యార్థులకు ఇంకా ముఖ్యం. హాస్టల్ కేటాయింపు కోసం యూజీ విద్యార్థినులు చేస్తున్న ధర్నా, డిమాండ్‌కు మా మద్దతు పూర్తిగా ఉంటుంది.
పీజీ విద్యార్థినులకు ఉస్మానియాలో హాస్టల్ ఉంది. కాబట్టి ఇక్కడ కట్టిన కొత్త హాస్టల్ భవనం యూజీ విద్యార్థినులకు ఇవ్వాలి. పీజీ విద్యార్థులకు ఇవ్వాలి అనుకుంటే మరో కొత్త భవనం కట్టి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. అధికారంలో ఉన్నారు కాబట్టి అహాంకారంతో ప్రవర్తిస్తే మంచిది కాదని నవన్ మిట్టల్‌ను హెచ్చరిస్తున్నాం. మొత్తం విద్యా వ్యవస్థనే నాశనం చేస్తున్న వ్యక్తి నవీన్ మిట్టల్.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు చదువు అందకుండా ఉన్నత విద్యను ప్రైవేట్‌పరం చేస్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలు, కాలేజీలకు సహకరిస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోంది. టీఆర్‌ఎస్‌కు తొత్తులా నవీన్ మిట్టల్ పనిచేస్తున్నారు. నవీన్ మిట్టల్ వచ్చాకే ప్రభుత్వ కాలేజీలు మూత పడుతున్నాయి. విద్యార్థులకు మరో మార్గంలేక ప్రైవేట్ యూనివర్సిటీల్లో చేరేలా పరోక్షంగా ఒత్తిడి తీసుకువస్తోంది ఈ ప్రభుత్వం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment