మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్న ఐక్య కార్మిక సంఘాల నాయకులు
సాక్షి నెట్‌వర్క్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ఐక్య కార్మిక సంఘాల అధ్వర్యంలో ఆయా కలెక్టరేట్ల ఎదుట మహాధర్నాలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో వ్యవసాయ మార్కెట్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. హనుమకొండలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
జయశంకర్ భూపాలపల్లిలోని సింగరేణి గనుల్లో అన్ని సంఘాల నాయకులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జనగామలో రైల్వేస్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యా లీగా వచ్చి ధర్నా చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచే పార్టీలు, సంఘాల నాయకులు ఆర్టీసీ డిపోల వద్దకు చేరుకుని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే, అధికారులు ముందుగానే దూరప్రాంత సర్విసులు రద్దుచేశారు. మిగతా సర్విసులు మధ్యాహ్నం తర్వాత మొదలయ్యాయి. కాగా, ఖమ్మం రూరల్ మండలం కాశిరాజుగూడెం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులను కూడా నిరసనకారులు అడ్డుకున్నారు.
హాల్ టికెట్లు చూపించినా అనుమతించకపోవడంతో విద్యార్థులు కన్నీటిపర్యంతం కాగా, ఇతరులు సర్దిచెప్పడంతో పంపించారు. ఇక సింగరేణివ్యాప్తంగా సమ్మె పాక్షికంగానే సాగింది. 39,010 మంది కార్మికులకు 18,072 వేల మంది(60 శాతం) విధులకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. అయితే, రోజువారీ లక్ష్యంలో 10 శాతం మేర బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment