మాది ప్రజాప్రభుత్వం..ప్రజల కోసం పనిచేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
పునరావాస కేంద్రాలు, ముంపు ప్రాంతాల్లో పర్యటన
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘వరదతో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం..ఎంత ఖర్చయినా పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మాది ప్రజా ప్రభుత్వం... ప్రజల కోసం పనిచేస్తుంది’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో ఆయన ఖమ్మం నగరం, మధిర నియోజకవర్గాల్లో పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ముంపు బాధితులతో మాట్లాడుతూ ప్రభుత్వపరంగా సౌకర్యాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. పలు ప్రాంతాల్లో వరదలతో నష్టపోయిన బాధితులను పరామర్శించడంతోపాటు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భారీ వర్షాలు ఇంకా ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
అర్ధరాత్రి ఖమ్మం చేరుకొని..
ఆకేరు, మున్నేరు వరద మళ్లీ పెరుగుతోందన్న సమాచారంతో డిప్యూటీ సీఎం భట్టి శనివారం అర్ధరాత్రి ఖమ్మం చేరుకున్నారు. కాల్వొడ్డు వద్ద ప్రజలతో మాట్లాడి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు. ఆ తర్వాత కాల్వొడ్డులో మున్నేరు బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. అక్కడి నుంచి స్వర్ణభారతి కల్యాణ మండపం, మహిళా డిగ్రీ కళాశాల, ఖమ్మం అర్బన్ మండలం ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించిన భట్టి.. బాధితులతో మాట్లాడి తాగునీరు, ఆహా రం, వైద్యం, మందులు అందుతున్నాయా, లేదా అని ఆరా తీశారు. ఎక్కడా సౌకర్యాల కల్పనకు వెనక్కి తగ్గొద్దని, బా«ధితులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన వెంట వచ్చిన కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, సీపీ సునీల్‌దత్‌ను ఆదేశించారు.
మధిర నియోజకవర్గంలో పర్యటన
మధిర నియోజకవర్గంలోని ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర మండలాల్లో డిప్యూటీ సీఎం భట్టి పర్యటించారు. వరదతో దెబ్బతిన్న పంటపొలాలు, రోడ్లు, కట్టలు తెగిన చెరువులు, కూలిన ఇళ్లను పరిశీలించి, బాధితులను పరామర్శించి ఓదార్చారు. గండ్లు పడిన చెరువులు, దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల పునర్నిర్మాణానికి అంచనాలు వెంటనే రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఆరుగురు మృతి చెందగా, వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెక్కులు అందజేశారు. దెబ్బతిన్న పాఠశాలల్లో బురద తొలగించి త్వరగా పున:ప్రారంభం అయ్యేలా చూడాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment