మామిళ్ల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితిని రూ. 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. రెండు రోజులపాటు జరగనున్న అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జీఈఎఫ్) జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజా ప్రాంగణంలో శనివారం ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఉద్యోగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా ఆదాయపన్ను పరిమితిని పది లక్షలకు పెంచాలని కోరారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణలో 30% ఫిట్‌మెంట్‌ను రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇచ్చా రని, దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా స్పందించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరితే, దాన్ని రాష్ట్రాలపై రుద్దడం సమంజసం కాదని అన్నారు. ఏఐఎస్‌జీఈఎఫ్ జాతీయ చైర్మన్ కామ్రేడ్ సుభాష్ లాంబ, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శ్రీకుమార్‌ల అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో 104 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు, 29 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటున్నారు.
ఈ సమావేశాలలో ప్రధానంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చర్చించినట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు. అలాగే కోవిడ్‌తో మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా మంజూరు లాంటి అనేక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment