జడ్చర్ల: రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. దీంతో పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు సాయం కోరుతూ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కార్యాలయ అధికారులు వెంటనే కలెక్టర్, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ లోగా గుండెపోటు వచ్చిన ప్రయాణికుడు తుదిశ్వాస విడిచాడు. వివరాలిలా ఉన్నాయి.. పంజాబ్‌లోని పాటియాల జిల్లా ప్రతాప్‌గఢ్‌కు చెందిన హరిప్రీత్‌సింగ్ (35) కొన్నాళ్లుగా కర్ణాటకలోని దావణగెరెలో వరికోత యంత్రం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
శనివారం సాయంత్రం అతను తన మిత్రుడు హరిప్రీత్‌సింగ్ (ఇద్దరి పేర్లు ఒక్కటే)తో కలసి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో స్వగ్రామానికి బయలుదేరాడు. ఆదివారం ఉదయం మార్గమధ్యంలోని మహబూబ్‌నగర్ దాటాక హరిప్రీత్‌సింగ్ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. ఇది గమనించిన మరో ప్రయాణికుడు వెంటనే మంత్రి కేటీఆర్‌కు సాయంకోసం ట్వీట్ చేయడంతో తక్షణం స్పందించారు. ఆయన కార్యాలయ అధికారులు మహబూబ్‌నగర్ కలెక్టర్‌కు సమాచారం ఇచ్చి అధికారులను అప్రమత్తం చేశారు. అయితే అంతలోనే అతను మృతి చెందాడు.
దీంతో జడ్చర్ల స్టేషన్ సమీపంలో చైన్‌లాగి రైలును ఆపారు. అనంతరం మృతదేహాన్ని జడ్చర్ల తహసీల్దార్ లక్ష్మీనారాయణ, రైల్వే హెచ్‌సీ కృష్ణ ఆధ్వర్యంలో బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతదేహం బుధవారం అక్కడికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. మృతుని స్వగ్రామం ఇక్కడికి సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెప్పారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment