
బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు
మిరుదొడ్డి(దుబ్బాక): భార్య డబ్బులివ్వలేదన్న కోపంతో నివసిస్తున్న గుడిసెకే నిప్పు పెట్టాడో భర్త. ఈ ఘటనలో గుడిసెలో దాచుకున్న రూ.1.73 లక్షల నగదుతో పాటు విలువైన వస్తువులు కాలిబూడిదయ్యాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని లక్ష్మీనగర్‌లో శనివారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. గుండవేణి మమత, బాలయ్య భార్యాభర్తలు. మూడు నెలల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గూడెం నుంచి బతుకుదెరువు కోసం లక్ష్మీనగర్‌కు వలస వచ్చారు.
గ్రామంలో ఒక గుడిసె వేసుకుని నివసిస్తున్నారు. మద్యానికి బానిసైన బాలయ్య తరచుగా భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో భూమికి సంబంధించిన రూ.1.73 లక్షల నగదు రావడంతో మమత బీరువాలో దాచింది. ఆ డబ్బును తనకివ్వాలని భార్యతో బాలయ్య శుక్రవారం రాత్రి గొడవ పడ్డాడు. డబ్బులివ్వకుంటే గుడిసెకు నిప్పు పెడతానని బెదిరించగా..భార్య ఇవ్వనని చెప్పి అదేరాత్రి భయంతో పొరుగునే ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది.
దీంతో డబ్బులివ్వలేదని కోపంతో శనివారం తెల్లవారు జామున బాలయ్య గుడిసెకు నిప్పు అంటించి పరారయ్యాడు. ఈ ఘటనలో బీరువాలో ఉంచిన నగదుతో పాటు విలువైన సామగ్రి, దుస్తులు కాలిపోయాయి. బాధితురాలిని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. బాధితురాలిని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. మమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment