![manchu manoj admitted to hospital in hyderabad for treatment: Telangana](/styles/webp/s3/article_images/2024/12/9/manchu.jpg.webp?itok=c8dOr5cy)
బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం భార్యతో కలిసి వస్తున్న మంచు మనోజ్
మనోజ్‌పై మోహన్‌బాబు దాడి చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్
నడవలేని స్థితిలో ఆస్పత్రిలో చేరిన మనోజ్
తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదంటున్న పోలీసులు
తనపై దాడి జరిగిందంటూ మనోజ్ డయల్–100కు కాల్ చేసినట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో ఆదివారం హైడ్రామా నడిచింది. చిన్న కుమారుడు మనోజ్‌పై మోహన్‌బాబు దాడి చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఉదయం డయల్–100కు కాల్ చేసిన మనోజ్ తనపై దాడి జరిగిందని చెప్పడం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే మనోజ్ నడలేని పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరడంతో అసలేం జరిగిందనే ఉత్కంఠ నెలకొంది.
మనోజ్‌కు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు, మెడికో లీగల్ కేసుగా పరిగణిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మాత్రం ఈ అంశంపై తమకు ఎలాంటి లిఖిత పూర్వక ఫిర్యాదు అందలేదని, డయల్–100కు కాల్ చేసిన మనోజ్ తనపై దాడి జరిగిందని మాత్రం చెప్పారని తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హోరెత్తిన సోషల్ మీడియా 5
పహడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలోని జల్‌పల్లిలో ఉన్న ఇంట్లో తనతో పాటు తన భార్యపై దాడి జరిగిందంటూ మనోజ్ పంపినట్లుగా ఉన్న ఓ సందేశం ఆదివారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు డయల్–100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు జల్‌పల్లిలోని ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మోహన్‌బాబు, మనోజ్ తదితరులు ఇది తమ ఇంటి విషయమని, కుటుంబ వివాదమని చెప్పారని, దాంతో వెనుతిరిగినట్లు సమాచారం.
కొద్దిసేపటికే మోహన్‌బాబు ఆదేశాల మేరకు ఆయన ప్రధాన అనుచరుడు, విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ దాడి చేసినట్లుగా మనోజ్ పేరుతో ఒక ప్రకటన బయటకు వచి్చంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, అలాంటిది ఏం జరగలేదని మంచు కుటుంబం పేరుతో మరో ప్రకటన వచి్చంది. దీంతో మనోజ్‌పై దాడి ఊహాజనితం అయి ఉండచ్చని అంతా భావించారు. కానీ ఆ తర్వాత కొన్ని గంటలకే మనోజ్ తన భార్యతో కలిసి నడవలేని స్థితిలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు.
కాలికి, మెడపై స్వల్ప గాయాలు
భార్య, సహాయకుడి సహకారంతో మనోజ్ కుంటుతూ లోనికి వెళ్లడంతో ఏదో జరిగిందనేది మాత్రం స్పష్టమయ్యింది. భూమా మౌనిక మాత్రం సాధారణంగానే కనిపించారు. మనోజ్ కాలికి గాయమైందని, మెడపై కూడా స్పల్ప గాయాలున్నట్లు గుర్తించిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం రాత్రి కొందరు సినీ, రాజకీయ పెద్దలు మంచు కుటుంబ సమస్యల్ని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ పరిణామాలన్నింటిపై ఎవరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడక పోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment