పూలు, ఆకుకూరల విత్తనాలతో రూపొందించిన పెళ్లిపత్రిక
సాక్షి, నిర్మల్: పెళ్లిపత్రిక.. ఆ పెళ్లి తేదీ, వివాహ వేదిక చూస్తే చాలు.. మళ్లీ దాన్ని ఎక్కడో పడేస్తాం. కొన్నిసార్లు సదరు పెళ్లి కాకముందే చెత్తబుట్టల్లోకి చేరిపోతుంటాయి. అలా.. కాకుండా మట్టిలో చేరి, మొక్కగా ఎదిగి, తమను ఆశీర్వదించిన వారింట పచ్చదనం నిండేలా పత్రిక ఉండాలనుకున్నారు. ఆ దిశగా.. ప్రయత్నం చేసి అనుకున్నది సాధించారు. వినూత్నంగా పర్యావరణ పెళ్లిపత్రికను రూపొందించి, బంధుమిత్రులనే కాదు.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన అల్లం వనమాల, దేవీదాస్ దంపతుల కుమారుడు ప్రవీణ్ హైదరాబాద్‌లో మెడికల్‌షాప్ నిర్వహిస్తుంటాడు. ఈనెల 27న ఆయన పెళ్లి ఉంది. ఇందుకు వినూత్నంగా ఆహ్వానం పలకాలని, తామిచ్చే పత్రిక ఉత్తగా చెత్తలోకి వెళ్లకుండా ఉపయోగపడాలని భావించారు. బంతి, తులసి, గులాబీ, పాలకూర విత్తనాలతో ప్రత్యేకంగా పెళ్లిపత్రికను తయారు చేయించారు.
చదవండి: కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు: హరీష్ రావు
ఏంచేయాలో..
తమ పెళ్లి తర్వాత తామిచ్చిన పత్రికను పారేయకుండా.. ఓ గంట నీటిలో నానబెట్టి, పూలకుండీలో పెట్టాలని ప్రవీణ్ చెబుతున్నారు. అలా మట్టిలో కలిసిన తర్వాత ఆ పత్రికలో ఉన్న విత్తనాల నుంచి మొలకలు వస్తాయని, వాటికి నిత్యం నీటిని పోస్తే మొక్కలుగా ఎదుగుతాయని వివరిస్తున్నారు. ఈ విధానాన్ని పత్రిక కింది భాగంలో ముద్రించారు.
కోయంబత్తూరు నుంచి..
ఈ పర్యావరణ పత్రికను ఆన్‌లైన్‌లో చూశామని, తమిళనాడులోని కోయంబత్తూరులో తయారు చేయించామని చెప్పారు. ఒక్కో పత్రికకు రూ.50వరకు ఖర్చు అయిందన్నారు. పర్యావరణ హితమైన ఈ పత్రిక కవర్‌పైన దేశనాయకులైన వివేకానంద, శివాజీ, భగత్‌సింగ్, కుమ్రంభీమ్ తదితరుల ఫొటోలను ముద్రించడం వల్ల తమ దేశభక్తినీ ప్రవీణ్ చాటుకున్నారు.
చదవండి: రెండోసారి మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment