రేపటి నుంచి..  వైద్య కళాశాలలు ప్రారంభం | Medical colleges opens from 29th July Telangana | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి..  వైద్య కళాశాలలు ప్రారంభం

Published Wed, Jul 28 2021 12:59 AM | Last Updated on Wed, Jul 28 2021 12:59 AM

Medical colleges opens from 29th July Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలలు ఈ నెల 29 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. మెడికల్, డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఆయుష్‌ తదితర కాలేజీలన్నీ గురువారం నుంచి మొదలవుతాయి. తొలుత ఫైనలియర్‌ విద్యార్థులను మాత్రమే ప్రాక్టికల్స్, క్లినికల్‌ శిక్షణకు అనుమతించాలని భావించినా, తర్వాత అన్ని సంవత్సరాల విద్యార్థులను అనుమతించాలని నిర్ణయించారు. అయితే ప్రాక్టికల్స్, క్లినికల్‌ తరగతులకు విద్యార్థులు అందరూ ఒకేసారి హాజరు కాకుండా వారిని రెండు బ్యాచ్‌లుగా విభజిస్తారు.

తరగతిలోని సగం మంది విద్యార్థులకు నెలలో 15 రోజులు, మిగిలిన వారికి మిగతా 15 రోజులు క్లాసులు నిర్వహిస్తారు. విద్యార్థుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందజేస్తారు. హాస్టల్‌ సౌకర్యం కూడా ఉంటుంది. అయితే రెండు బ్యాచులుగా విభజిస్తున్నందున ఒక బ్యాచ్‌వారు 15 రోజులు హాస్టల్‌లో ఉంటే, మరో బ్యాచ్‌వారు తదుపరి 15 రోజుల్లో హాస్టల్‌లో ఉంటారు. ఇలా అందరూ ఒకేసారి హాస్టళ్లలో ఉండకుండా ప్రణాళిక రూపొందించనున్నారు. థియరీ క్లాసులు మాత్రం ఇప్పటి మాదిరిగానే ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదేశాలు జారీ చేసింది. 

అందరికీ టీకాలు వేయాలి 
మెడికల్‌ విద్యార్థుల్లో సుమారు 60 శాతం మందికి ఇప్పటికే కరోనా టీకాలు వేశారు. మిగిలిన విద్యార్థులకు కూడా వెంటనే ఇచ్చేలా కాలేజీలు దృష్టి సారించాలని ప్రభుత్వం సూచించింది. విద్యార్థులు కాలేజీలకు వచ్చేముందు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని ఆ రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. నెగటివ్‌ ఉన్నవారికే కాలేజీకి రావడానికి అనుమతి ఉంటుంది. ప్రతి 15 రోజులకోసారి కాలేజీకి వచ్చేప్పుడు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష తప్పనిసరని అంటున్నారు. వాస్తవానికి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కాలేజీలను ప్రారంభించడానికి వర్సిటీ అనుమతి కోరింది. అయితే ప్రభుత్వం మూడు రోజులు ముందుగానే కాలేజీలను ప్రారంభించాలని నిర్ణయించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement