పంథా మార్చుకున్న హైడ్రా.. చర్యలకు ముందు స్థానికులతో సమావేశం
స్వయంగా రంగంలోకి కమిషనర్ రంగనాథ్
సాక్షి, హైదరాబాద్/ అంబర్‌పేట: ‘పేదల ఇళ్లు కూల్చం.. చెరువులను పునరుద్ధరిస్తాం’’.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తాజాగా ఎత్తుకున్న నినాదమిది. ఇటీవలి వరకు చెరువుల పరిధిలో కూల్చివేతలతో కలకలం రేపిన హైడ్రా తన పంథా మార్చుకుంది.
ఎక్కడైనా నీటి వనరుల పునరుద్ధరణ చర్యలకు ఉపక్రమించే ముందు స్థానికులతో భేటీ కావాలని.. తమ లక్ష్యం, దాని వల్ల ఒనగూరే ప్రయోజనాలను వారికి వివరించాలని నిర్ణయించింది. దీనికోసం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. అంబర్‌పేటలోని బతుకమ్మకుంట నుంచి దీనికి శ్రీకారం చుట్టారు.
బుధవారం ఆ ప్రాంతానికి వచ్చిన రంగనాథ్.. పేదల ఇళ్లు కూల్చబోమని, ఆక్రమణలకు గురై ఖాళీగా ఉన్న స్థలాలను మాత్రమే శుభ్రం చేస్తామని వివరించారు. బతుకమ్మకుంట పునరుద్ధరణ జరిగితే.. ముంపు తప్పడంతోపాటు భూగర్భ జలాల లభ్యత పెరుగుతుందని స్థానికులకు అవగాహన కల్పించారు. ఆ ప్రాంతంలో ఓ ఆహ్లాదకరమైన పార్కును నిర్మిస్తామని తెలిపారు. దీంతో బతుకమ్మకుంటలో ఉన్న ఆక్రమణల తొలగింపునకు స్థానికులు ముందుకు వచ్చారని అధికారులు చెబుతున్నారు.
పక్షం రోజుల పాటు కసరత్తు చేసి..
బతుకమ్మకుంటకు పునరుద్ధరణకు సంబంధించి క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టడానికి ముందు హైడ్రా దాదాపు పక్షం రోజుల పాటు కసరత్తు చేసింది. ఈ అంశాన్ని న్యాయ నిపుణులతో వివిధ కోణాల్లో చర్చించింది. న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసి ముందుకు వెళ్లింది. ప్రొక్లెయినర్లతో తొలగింపు ప్రక్రియ చేపట్టడానికి ముందే స్థానికులకు అవగాహన కల్పించింది.
ఇది విజయవంతమైందని, ఇకపై ఇదే విధానాన్ని కొనసాగించాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు. బతుకమ్మకుంటలో ఉన్న వీకర్ సెక్షన్ కాలనీ వాసులతో మాట్లాడిన రంగనాథ్.. హైడ్రా పేరుతో ఎవరైనా భయపెట్టాలని, బ్లాక్‌మెయిల్ చేయాలని చూస్తే ఉపేక్షించవద్దని సూచించారు.
పదహారు ఎకరాల నుంచి ఐదెకరాలకు..
అంబర్‌పేటలోని బతుకమ్మకుంటను పునరుద్ధ రించి, పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించిన హైడ్రా అధికారులు దాని పూర్వాపరాలను అధ్యయనం చేశారు. 1962–63 నాటి రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 563లో 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట విస్తరించి ఉండేది. ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లతో కలిపి దీని వైశాల్యం 16.13 ఎకరాలని అధికారులు తేల్చా రు.
తాజా సర్వే ప్రకారం బతుకమ్మకుంటలో మిగిలినది 5.15 ఎకరాలేనని గుర్తించారు. దీంతో అంత మేరకు కుంటను పునరుద్ధరించాలని హైడ్రా కమిషనర్ నిర్ణయించారు. ఇప్పటికే అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించకుండా.. ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చెరువు తవ్వకాలు చేపట్టాలని ఆదేశించారు. దీనితో స్థానికులు హైడ్రాకు సహకరించేందుకు ముందుకొచ్చారు.
ఒకప్పటి ఎర్రకుంటనే బతుకమ్మకుంటగా మారిందని.. రెవెన్యూ రికార్డులూ అదే చెప్తున్నాయని స్థానికులు హైడ్రా దృష్టికి తెచ్చారు. అయితే ఇటీవలి పలు పరిణామాల నేపథ్యంలో బతుకమ్మకుంట వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ స్థలం ప్రైవేటుది అని వాదించిన బీఆర్‌ఎస్ నేత ఎడ్ల సుధాకర్‌రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు.
తార్నాకలోని ఎర్ర కుంటను పరిశీలించి..
బుధవారం తార్నాకలోని ఎర్రకుంటను రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూస్తూ, ఎర్రకుంటను పునరుద్ధరించాలని నాగార్జున కాలనీ సంక్షేమ సంఘం వినతి పత్రం సమరి్పంచింది. ఈ మేరకు పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని రంగనాథ్ అధికారులను ఆదేశించారు.
జనావాసాల జోలికి హైడ్రా వెళ్లదు
హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ పేదల జనావాసాల జోలికి వెళ్లదు. పెద్ద చెరువుగా ఉండాల్సిన బతుకమ్మకుంట క్రమేణా కుంచించుకుపోయింది. దానిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నాం. దీని పక్కన ఉన్న బస్తీ వాసులకు గతంలో పట్టాలు ఇచ్చారు. ఆ ఇళ్లను హైడ్రా కూలుస్తుందనే దుష్ఫ్రచారం నేపథ్యంలో.. ఇక్కడికి వచ్చి స్థానికులకు వాస్తవాలు వివరించాం.
వారి సహకారంతోనే బతుకమ్మకుంట పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నాం. రాజకీయాలకు అతీతంగా వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో చట్టపరంగా అన్ని అంశాలను పరిశీలిస్తూ, అన్ని విభాగాలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని తుది నిర్ణయం తీసుకున్నాం. కొందరు బతుకమ్మకుంట ప్రైవేటు స్థలమని వాదిస్తున్నప్పటికీ సరైన ఆధారాలు చూపలేదు. – ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్
ఇళ్లు కూల్చబోమని హామీ ఇచ్చారు
హైడ్రా కమిషనర్ వచ్చి మాతో మాట్లాడారు. మా ఇళ్లను కూల్చబోమని హామీ ఇచ్చారు. దోమలు, దుర్వాసన లేకుండా బతుకమ్మకుంటను పునరుద్ధరిస్తామని చెప్పారు. కేవలం ఖాళీగా ఉన్న జాగానే చెరువుగా అభివృద్ధి చేస్తామన్నారు. అలా చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. – అరుణ, వీకర్ సెక్షన్ కాలనీ
రంగనాథ్ సార్ వచ్చి ధైర్యం చెప్పారు
బతుకమ్మకుంటలో సుమారు 50 ఏళ్లుగా నివసిస్తున్నాం. నగరంలో అక్కడక్కడా ఇళ్లు కూలుస్తుంటే భయం వేసింది. మా వద్దకు కూడా వచ్చి ఇళ్లు కూల్చేస్తారని కొందరు భయపెట్టారు. ఈ రోజు రంగనాథ్ సార్ వచ్చి ధైర్యం చెప్పారు. ఇళ్లు కూల్చబోమని, ఖాళీగా ఉన్న స్థలంలోనే కుంటను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. – సుంకమ్మ, వీకర్ సెక్షన్ కాలనీ
Comments
Please login to add a commentAdd a comment