దేశంలోనే మొదటిసారిగా సాగర కన్యల జల ప్రదర్శన
ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన జలకన్యలు
అమెజాన్ నది నుంచి అరుదైన చేపలు
అబ్బురపరుస్తున్న అండర్ వాటర్ మెర్మెయిడ్ షో
సాక్షి, హైదరాబాద్: మత్స్యకన్యలు, సాగర కన్యల గురించి కథలుగా చెప్పుకోవడం, సినిమాల్లో చూడటం తప్ప నిజంగా వారిని చూసిన వారెవరూ లేరు. అయితే ఈ జల కన్యలు ఉన్నది వాస్తవమో కాదో కానీ... హైదరాబాద్ నగరానికి చేరుకున్న మత్స్య కన్యలు మాత్రం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ డబల్ డెక్కర్ ఎగ్జిబిషన్ మెర్మెయిడ్ షోలో మనం చూస్తుంది నిజమేనేమో అనిపించేలా మత్స్యకన్యలు ఆకట్టుకుంటున్నారు.
ఫిలిప్పీన్ సాగర కన్యలు.. అమెజాన్ చేపలు..
అండర్ వాటర్ టన్నెల్ డబల్ డెక్కర్‌ను ఏర్పాటు చేసి, అందులో అరుదైన చేపల ప్రదర్శన, స్కూబా డైవింగ్ వంటి వినూత్న ప్రదర్శనలు ఏర్పాటు చేయడం నగరవాసులకు పరిచయమే. కానీ ఊహాజనిత కథలుగా చెప్పుకునే సాగరకన్యలు, హాలీవుడ్ సినిమాల్లో అందంగా కనిపించే మత్స్యకన్యల ప్రదర్శన మాత్రం దేశంలోనే ఇదే మొదటిసారి.
దీని కోసం పసిఫిక్ మహాసముద్రంలో ప్రదర్శననిచ్చే ఫిలిప్పీన్‌కు చెందిన ఆరుగురు యువతులు నగరానికి చేరుకున్నారు. మర్మెయిడ్‌గా పిలుచుకునే వీరు జల కన్యల వస్త్రధారణతో 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్‌లో ఆక్సిజన్ లేకుండా ప్రదర్శన చేయడం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది.
ఈ మమెడ్ షోలు గతంలో దుబాయ్, థాయ్‌లాండ్, హాంకాంగ్ వంటి దేశాలకు మాత్రమే పరిమితం. ఈ అండర్ వాటర్‌లో సింగపూర్, మలేసియాతో పాటు అమెజాన్ నది నుంచి తీసుకువచి్చన 600 అరుదైన చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడి స్కూబా డైవింగ్ కూడా మంచి అనుభూతిని అందిస్తుంది. మరో 37 రోజుల వరకు ఈ ప్రదర్శన జరగనుందని నిర్వాహకులు తెలిపారు.
విజ్ఞానం, వినోదమే లక్ష్యంగా..
విదేశాల్లో మాత్రమే చూడగలిగే మెర్మెయిడ్ షోను కోట్ల రూపాయల వ్యయంతో, ఎంతో వ్యయప్రయాసలకోర్చి నగరంలో ఏర్పాటు చేశాం. ఎగ్జిబిషన్ రంగంలో మాకు 39 ఏళ్ల అనుభవం ఉంది. ప్రజలకు అద్భుత అనుభూతిని అందించేందుకు ఫిలిప్పీన్స్ నుంచి జలకన్యలను తీసుకువచ్చాం.
ఆక్సిజన్ లేకుండా నిమిషానికిపైగా నీటిలోనే ఉంటూ ప్రదర్శన ఇవ్వడం అరుదైన కళ. వీటితో పాటు 27కు పైగా అమ్యూజ్‌మెంట్ గేమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు విజ్ఞానం, వినోదం అందిస్తున్నాం. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. షో మాత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. – రాజారెడ్డి, నిర్వాహకుడు
Comments
Please login to add a commentAdd a comment