
సాక్షి, హైదరాబాద్: నిత్యం జనసమ్మర్థం.. వాహనాల రద్దీతో పద్మవ్యూహాన్ని తలపించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులకు అతి పెద్ద ఊరట లభించనుంది. రైల్వేస్టేషన్‌కు నాలుగు వైపులా ఉన్న బస్టాపులను అనుసంధానం చేస్తూ మినీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఓ బస్సును ఏర్పాటు చేశారు. కేవలం రూ.5 టికెట్‌తో ప్రయాణికులు ఒక బస్టాపు నుంచి మరో బస్టాపు వరకు వెళ్లవచ్చు.
అనుసంధానం ఇలా..
కేవలం రెండు మూడు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్న ఆయా బస్టాపుల్లో ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు ప్రయాణికులు నడక దారిలో అవస్థల పాలవుతున్నారు. ఆటోల్లో వెళ్లాలంటే కొద్దిపాటి దూరానికే రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లించుకోవాల్సి వస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చుట్టూ ఉన్న బస్టాపుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ఘట్కేసర్, బోడుప్పల్ వైపు నుంచి వచ్చి చిలకలగూడ చౌరస్తాలో దిగి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వెళ్లే ప్రయాణికులకు వెసులుబాటు కలగనుంది. మల్కాజిగిరి, ఈసీఐఎల్ వైపు నుంచి వచ్చే బస్సులు బ్లూసీ హోటల్ ఎదురుగా ఉన్న బస్టాపులకే పరిమితం. అక్కడ దిగిన వాళ్లు రైల్వేస్టేషన్‌కు వెళ్లాలన్నా, చిలకలగూడ క్రాస్‌రోడ్‌కు వెళ్లాలన్నా ఒకటిన్నర కిలోమీటర్ నడవాలి. అల్వాల్, బోయిన్‌పల్లి, జీడిమెట్ల, బాలానగర్, పటాన్‌చెరు, తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు సికింద్రాబాద్ గురుద్వారాకే పరిమితం. ఇక్కడ దిగి అటు బ్లూసీ వైపు, ఇటు చిలకలగూడ వైపు వెళ్లేవారికి ఊరట లభిస్తుంది.
చదవండి: హైదరాబాద్ మెట్రో: టికెట్ ధరలు పెంపునకు సంకేతాలు
Comments
Please login to add a commentAdd a comment