గజ్వేల్: ఉపాధ్యాయుల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన పీఆర్‌టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశానికి రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారన్నారు.
సీపీఎస్ రద్దు, జీపీఎఫ్ సత్వర చెల్లింపులు, హెల్త్ కార్డుల అంశంపై కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యాశాఖ ఖాళీల భర్తీపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ డీఈవో, డీఈవో పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. డబుల్ ఇంజిన్ సర్కారుగా చెప్పుకునే గుజరాత్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో ఉపాధ్యాయుల వేతనం చాలా ఎక్కువని గుర్తుచేశారు. మరోవైపు పక్క రాష్ట్రాల్లో ఉపాధ్యాయులు సమస్యలపై కొట్లాడితే నిర్బంధిస్తున్నారని, అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదని పేర్కొన్నారు. తమది ఉద్యోగ, ఉపాధ్యాయ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని పేర్కొన్నారు.
పెరిగిన తలసరి ఆదాయం
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల రాష్ట్రంలో తలసరి ఆదాయం భారీగా పెరిగిందని, 2014కు ముందు 1.24 లక్షలుగా ఉంటే ప్రస్తుతం అది 2.70 లక్షలకు చేరుకుందని మంత్రి హరీశ్ చెప్పారు. దేశ తలసరి ఆదాయం తెలంగాణ కంటే తక్కువగా 1.48 లక్షలు ఉందని తెలిపారు. తెలంగాణ ఎదుగుదలను కేంద్రం జీర్ణించుకోలేకపోతోందని ఆక్షేపించారు. ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వం సాచివేత ధోరణిని అవలంబిస్తోందని మండిపడ్డారు. ఈ ఏడాది బోరుబావులకు మీటర్లు పెట్టనందుకు రూ. 6 వేల కోట్లు, ఎఫ్‌ఆర్‌బీఎం కింద రావాల్సిన రూ. 15 వేల కోట్లు కలుపుకొని మొత్తంగా రూ. 21 వేల కోట్లను ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కేంద్రం తెలంగాణకు నిలిపేసిందని ఆరోపించారు.
తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో 800 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్య 2,950కి పెంచామన్నారు. వచ్చే ఏడాది మరో 9 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, సిద్దిపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శశిధరశర్మ, వెంకటరాజం, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఎల్‌ఆర్‌ఎస్.. గప్‌చుప్! చడీచప్పుడు లేకుండా వెంచర్ల క్రమబద్ధీకరణ
Comments
Please login to add a commentAdd a comment