సాక్షి, హైదరాబాద్: ‘నేతలు, పార్టీలు, పదవులు శాశ్వతం కాదు. కానీ రాష్ట్రం శాశ్వతం.. దాని పురోగతి శాశ్వతం. శాశ్వతంగా ఉండే రాష్ట్రాన్ని రాజకీయం కోసం శపించకండి. ఇటీవల మరీ కుసంస్కారంగా మాట్లాడే కొందరు నేతలు పుట్టుకొచ్చారు. దారుణంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ పురోగతిలో దేశంలోనే ముందువరుసలోకి దూసుకు పోతుండటంతో వారు సహించలేకపోతున్నారు. నన్ను వ్యక్తిగతంగా దూషిస్తే దీవెనలుగా సర్దుకుపోతా, కానీ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా మాట్లాడకండి. రాజకీయాలు వేరు, రాష్ట్ర పురోగతి వేరు..’అని ప్రతిపక్ష నేతలకు పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హితవు పలికారు. సోమవారం శాసనసభలో పరిశ్రమలు, ఐటీ అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చకు ఆయన సమాధానమిచ్చారు.
దేశాన్నే తెలంగాణ సాదుతోంది
‘ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. దేశానికి ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, బెంగాల్ తర్వాత తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. భౌగోళికంగా, జనాభా పరంగా 12, 11 స్థానాల్లో ఉన్న తెలంగాణ, దేశానికి కాంట్రిబ్యూషన్ విషయంలో నాలుగో స్థానంలో ఉండటంతో దేశాన్నే తెలంగాణ సాదుతోందని అర్థమవుతోంది. ఖాయిలా పడ్డ పరిశ్రమలను తెరిపించేందుకు ఓ వైపు రాష్ట్రం ప్రయత్నిస్తుంటే సహకరించాల్సిన కేంద్రం.. వాటి భూములను తెగనమ్ముకునే పనిలో ఉంది, ప్రైవేటుపరం చేస్తే ప్రోత్సాహకాలిస్తానంటోంది. మా విధానం ‘స్టార్టప్’అయితే, కేంద్రం విధానం ‘ప్యాకప్’గా మారింది. స్పీకర్ అనుమతిస్తే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమే..’అని కేటీఆర్ ప్రకటించారు.
3ఐ మంత్రం నిజం చేస్తున్నాం
‘డిజిటల్ విప్లవాన్ని ప్రపంచంలోనే నవయువకుల జనాభా ఎక్కువగా ఉన్న దేశంగా మనం అద్భుతంగా ఒడిసిపట్టుకునే వీలుంది. గతంలో ప్రధాని నిర్వహించిన ఓ సమావేశంలో నేనూ పాల్గొన్నా. ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూజివ్ గ్రోత్ అనే 3ఐ మంత్రం గురించి వివరించా. అదే మంత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసి చూపుతోంది. 4 కోట్ల జనాభాలో 2 శాతం మందికి మించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం సాధ్యం కాదు. అందుకే ప్రైవేటు పెట్టుబడులను గరిష్టంగా తెచ్చి ప్రైవేటు రంగంలో ఉపాధికి మెరుగైన బాటలు వేసే ప్రయత్నం చేస్తున్నాం..’అని మంత్రి తెలిపారు.
తెలంగాణ వైపు చూస్తున్న కంపెనీలు
‘ప్రముఖ విదేశీ కంపెనీలు వాటి రెండోస్థాయి కేంద్రాలకు హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయి. ప్రపంచ ఐటీ దిగ్గజాల్లో టాప్ ఐదు కంపెనీలు వాటి రెండో ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్‌లో నెలకొల్పాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పెద్దపెద్ద కంపెనీలు కూడా వాటి విస్తరణకు తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఇందుకు టీఎస్–ఐపాస్ లాంటి పారదర్శక విధానాలు, నిరంతరాయ విద్యుత్తు సరఫరా వంటివే కారణం. ఎప్పుడో తెలంగాణ ప్రారంభించిన టీఎస్–ఐపాస్‌ను అనుసరిస్తూ తాజాగా కేంద్రం కూడా అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 17,302 పరిశ్రమలకు అనుమతిచ్చాం. రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఐటీతో కలుపుకొంటే 19 లక్షల మందికి ఉపాధి లభించింది. ఇక ఉద్యోగాల్లో 70 శాతం స్థానికులకే ఇచ్చే కొత్త పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలను కూడా ప్రతిపాదిస్తున్నాం..’అని తెలిపారు.
కట్టుకథలతో పెట్టుబడులు రావు
‘నీతి ఆయోగ్, రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ నివేదికల్లో తెలంగాణ పురోగతిని పొగుడుతున్నాయి. కేంద్రమంత్రులు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కానీ స్థానిక బీజేపీ నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారు. కానీ కట్టుకథలతో పెట్టుబడులు రావు. కఠోర పరిశ్రమతోనే సాధ్యమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్దవైన 300 కంపెనీలు తెలంగాణలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. కేసీఆర్ విజన్ ఎప్పుడూ గ్రాండ్‌గానే ఉంటుంది. ముచ్చర్లలో ప్రపంచంలోనే పెద్ద ఫార్మారంగం ఏర్పడుతోంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ వాడే హెలికాప్టర్ క్యాబిన్ కూడా తెలంగాణలోనే తయారవుతుంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫార్మా తదితర 14 ప్రాధాన్యతా రంగాలను ఎంపిక చేసుకుని వాటి తయారీ రంగాన్ని సాకారం చేస్తున్నాం..’అని చెప్పారు.
వారి వీడియోల్లోనే అభివృద్ధి కన్పిస్తోంది
‘కొందరు నేతలు పాదయాత్రల పేరుతో మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ల అవతారమెత్తారు. వారు సోషల్ మీడియాలో పెడుతున్న వీడియోల్లోనే ఆయా ప్రాంతాల్లో జరిగిన అద్భుత ప్రగతి తాలూకు దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెరసి రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరిగిందో వారే చూపిస్తున్నారు..’అని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ పాతనగర యువత కోసం శిక్షణ కేంద్రం, ఐటీ టవర్ ఏర్పాటుకు కేటీఆర్ హామీ ఇచ్చారు.
లక్షల సంఖ్యలో ఉపాధికి ప్రణాళికలు
‘ఉమ్మడి రాష్ట్రంలో 23,650 ఎకరాల్లో పారిశ్రామికవాడలు ఏర్పడితే, తెలంగాణ వచ్చాక టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో 19,961 ఎకరాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది కొత్తగా 56 పార్కులు అందుబాటులోకి వస్తాయి. ఐటీ రంగంలో ఐదేళ్లలో 5 లక్షల మందికి ఉపాధి అందేలా ప్రణాళికలు అమలులోకి తెస్తున్నాం. లైఫ్ సైన్సెస్ రంగంలో 4 లక్షల మందికి ఉపాధి దక్కేలా లక్ష్యం నిర్ధారించుకున్నాం.
కొత్తగా బీ–హబ్ ఏర్పాటు చేస్తున్నాం. మహబూబ్‌నగర్ దివిటిపల్లిలో ఎనర్జీ పార్కును, సంగారెడ్డి సమీపంలోని శివానగర్‌లో ఎల్‌ఈడీ పార్కును ప్రారంభించనున్నాం. చేవెళ్ల సమీపంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థలు వస్తున్నాయి. చైనా, బంగ్లాదేశ్‌ను ఢీకొనేలా దేశంలోనే పెద్దదైన కాకతీయ టెక్స్‌టైల్ పార్కుకు రూపకల్పన చేశాం. రామగుండం ఎరువుల కంపెనీ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నాం. దీని ప్రారంభోత్సవానికి ప్రధాని వచ్చే అవకాశం ఉంది..’అని కేటీఆర్ తెలిపారు.
కేంద్రం స్పందించలేదు
‘ఐడీపీఎల్ పునరుద్ధరణ సాధ్యం కాదని కేంద్రం తేల్చింది. ఐదు ఇండస్ట్రియల్ కారిడార్లు, ఫార్మా సిటీకి రూ.వేయి కోట్ల సాయం, ఐటీఐఆర్ పునరుద్ధరణ, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు కోసం కోరితే స్పందించలేదు..’అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment