సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు ఒకసారి దేశ్‌కీ నేతగా అవకాశం కల్పిస్తే.. ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టుగా దేశాన్ని తీర్చిదిద్దుతారని కార్మిక మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ ఎదుగుతుంటే కేంద్రం ఓర్వలేక అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో వివిధ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా తమ శాఖకు సంబంధించిన అంశాలపై మంత్రి మాట్లాడారు.
‘బలవంతమైన సర్పం చలిచీమల చేతచిక్కి చావదా సుమతీ’అనే నానుడి బీజేపీకి అతికినట్టు సరిపోతుందని.. ‘కేసీఆర్ ఒకసారి ఫైర్ అయితే మీరు మసై పోతారు’అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తాము ట్రెండ్ ఫాలో కాబోమని, ట్రెండ్ సెట్ చేస్తామని చెప్పారు. రామరాజ్యం మళ్లీ వస్తుందని.. అయితే అక్కడ (ఢిల్లీలో) చంద్రుడు, ఇక్కడ (తెలంగాణలో) తారకరాముడు ఉంటారని.. బంగారు భారత్‌తో చరిత్ర సృష్టిస్తామని పేర్కొన్నారు.
భవన నిర్మాణ కార్మికులు బుల్లెట్ బండ్లపై పనికి రావాలని, అందుకోసం రూ.లక్ష సబ్సిడీతో మే 1 నుంచి వాహనాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. కరోనా సమయంలో కూలీబిడ్డలకు తెలంగాణ అడ్డా అయిందని.. సారా జహాసే అచ్చాలో హిందుస్థాన్‌కు బదులు తెలంగాణ నిలిచిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ముందు దుబాయ్, గల్ఫ్ ఉత్తవే (నథింగ్)నని వ్యాఖ్యానించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో మందులు అందకపోతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment