సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యా వ్యవస్థ, విద్యార్థులను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అకారణంగా అవమానించారని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణలో చూసి పరీక్షలు రాస్తున్నారని చేసిన బొత్స వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయం మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, ఇతర అంశాలపై చర్చకు నన్ను రమ్మంటారా?.. మీరొస్తారా..? అని సవాల్ విసిరారు.
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి.. పోనీ హైదరాబాద్... ఎక్కడైనా సరే చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. మీ విద్యార్థులు మా విద్యార్థులతో పోటీ పడితే అసలు విషయం బయటపడుతుందన్నారు. ఏపీ నుంచి చదువు కోవడానికి తెలంగాణకు వస్తున్నారే తప్ప.. తెలంగాణ వాళ్లు ఏపీకి పోవడం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
అందరినీ సమానంగా చూసి ఉంటే రెండు రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండేవని, మీలాంటి వ్యక్తుల వ్యాఖ్యలతోనే తెలంగాణ విడిపోయిందని ఆరోపించారు. తిరుమల శ్రీవారి దర్శనం కావాలంటే రకరకాల ఇబ్బందులని, అదే మా దగ్గర యాదాద్రి, వేములవాడ, రామప్ప, భద్రకాళి ఎక్కడైనా సరే అందరినీ ఒకే రకంగా చూస్తామన్నారు. తమ పార్టీ బీఆర్‌ఎస్‌కు ఏపీ నుంచి కూడా బాగా ఆదరణ ఉందని శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment