మాట్లాడుతున్న తలసాని
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): కొంతకాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే.. కొన్ని వర్గాల వారు చర్చిలు, మసీదులు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. కానీ, రాష్ట్రంలో వారి పప్పులు ఉడకవని, ముఖ్యమంత్రి కేసీఆర్ అటువంటి వారిని ఉపేక్షించరన్నారు. రాష్ట్రంలోని క్రైస్తవులంతా ఒకేతాటిపైకి వచ్చి వారి హక్కులు, సంక్షేమ పథకాలు సాధించుకునేందుకు అవకాశాలను అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు.
మంగళవారం నారాయణగూడలోని బాప్టిస్టు చర్చిలో ‘తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్’(టీయూసీపీఏ) ఆధ్వర్యంలో 33 జిల్లాల పాస్టర్‌ల సమావేశం జరిగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలసి మంత్రి తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. క్రైస్తవుల్లో ఐకమత్యం లోపిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాద్ వరకు ప్రతి మండలానికి ఓ కమిటీని రూపొందించి ఈ కమిటీలన్నీ ఒకే గొడుగు కింద ఉండేలా కృషి చేయాలన్నారు.
అందరూ ఏకతాటిపైకి వస్తే దక్కాల్సిన హక్కులు తప్పకుండా దక్కుతాయన్నారు. మైనార్టీలు అంటే క్రైస్తవులు కాదనే ఆలోచన నుంచి క్రైస్తవులు బయటకు రావాలని సూచించారు. క్రైస్తవుల కోసం షాదీముబారక్ పేరుమార్పు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. లోపాలను సరిదిద్దుకుని ముందుకువచ్చి హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని, అందరూ ఏకతాటిపైకి వచ్చి నిలబడితే ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నానని తలసాని ప్రకటించారు. రాష్ట్రంలో కోటిన్నర జనాభా కలిగిన క్రైస్తవులు డెసిషన్ మేకర్స్ అని ఎమ్మెల్యే దానం అన్నారు. కొంతకాలంగా కొన్ని వర్గాలపై ప్రణాళిక ప్రకారం దాడులు జరుగుతున్నాయని.. దానిని అధిగమించేందుకు క్రైస్తవులు ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment