సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల యాత్రకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో భాగంగా గత బీఆర్‌ఎస్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ నెల 29న సందర్శించి అక్కడికక్కడే సమీక్ష జరపనున్నారు.
మొదటి నుంచి ‘కాళేశ్వరం’ను వ్యతిరేకించిన కాంగ్రెస్
ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు పనులను మధ్యలోనే నిలుపుదల చేసి దాని బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టింది. దీనిని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది.
అధికారంలోకి వస్తే ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు పనులను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నేపథ్యంలో మంత్రుల పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు పనుల పునరుద్ధరణ, ప్రాణహిత మీద తమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంపై తమ ప్రభుత్వ వైఖరిని మంత్రులు ప్రకటించే అవకాశం ఉంది.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్...
ఈ నెల 29న ఉదయం 9 గంటలకు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మేడిగడ్డ బ్యారేజీ వద్దకి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి తీసుకెళ్లనున్న మీడియా ప్రతినిధుల బృందం సమక్షంలో మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించనున్నారు.
ప్రాణహిత–చేవెళ్ల,, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో జరిగిన లాభ, నష్టాలు, ప్రాజెక్టు వ్యయం, ప్రతిపాదిత ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు, ప్రాజెక్టు నిర్వహణ వ్యయం, విద్యుత్ అవసరాలు, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో చోటుచేసుకున్న సాంకేతిక లోపాలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఇదిలా ఉండగా సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదలను ప్రభుత్వం వాయిదా వేసుకున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ రూపొందించిన నివేదికపై కూడా మీడియా సమక్షంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలున్నాయి. అనంతరం అక్కడే మంత్రులిద్దరూ సమీక్ష జరపనున్నారు.
కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లూ రావాలని ఆదేశం
ప్రజెంటేషన్ తర్వాత మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను మంత్రులిద్దరూ సందర్శించి లోపాలు, సమస్యలను పరిశీలిస్తారు. గత అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, ఆ తర్వాత కొన్ని రోజులకే అన్నారం బ్యారేజీకి బుంగలు ఏర్పడి భారీగా నీళ్లు లీకయ్యాయి. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ పునర్నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ మధ్య పేచీ నడుస్తోంది.
సొంతంగా పునర్నిర్మాణం జరుపుతామని గత ప్రభుత్వ హయాంలో హామీ ఇచ్చిన ఎల్ అండ్ టీ సంస్థ, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాటను మార్చింది. ప్రాజెక్టు డిఫెక్ట్ లయబిలిటీ గడువు ముగిసిందని, అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే 7వ బ్లాక్ పునర్నిర్మాణం చేపడతామని స్పష్టం చేసింది. నిర్మాణ సంస్థలతో పాటు సబ్ కాంట్రాక్టర్లు, ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న వారందరూ తమ పర్యటన సందర్భంగా క్షేత్ర స్థాయలో ఉండి అడిగిన సమాచారం ఇవ్వాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అందరికీ సమాచారం పంపించాలని నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌కు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment