సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ‘‘ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేనే రైతులను బెదిరించి 70 ఎకరాల అసైన్డ్ భూములను తీసుకుంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ ఇంక ఎంత మందిని భయపెట్టి హైదరాబాద్ కొండాపూర్, రంగారెడ్డి వంటి ప్రాంతాల్లో ఎన్ని వేల ఎకరాలు తీసుకుని ఉంటారు.. నాదైతే తొండలు కూడా గుడ్లు పెట్టని భూమి’’అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో బీజేపీ పదాధికారుల రెండు రోజుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన సోమవారం హాజరయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. జమునా హేచరీస్ సంస్థలో ఒక్క ఎకరం కబ్జాలో ఉన్నట్టు తేలినా ముక్కు నేలకు రాస్తానని తన భార్య జమున చెప్పినమాటకు కట్టుబడి ఉంటానని రాజేందర్ తెలిపారు. సిస్టం అంటూ ఒకటి ఉంటుందని, అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని హితవు పలికారు. తాను భూములు కబ్జా చేశానని అనడం మతిలేని చర్యగా అభివర్ణించారు.
‘స్థానిక’ఓటర్లు అంతరాత్మ సాక్షిగా ఓటేయాలి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వారి అంతరాత్మ సాక్షిగా ఓటు వేయాలని ఈటల రాజేందర్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టే.. కేసీఆర్‌కు ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు కనబడుతున్నారని, కానీ ఇన్నా ళ్లుగా చేసిన నిర్లక్ష్యం గుర్తుంచుకోవాలని అన్నారు. రాజ్యాంగంలోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారని ఈటల దుయ్యబట్టారు. చిన్న లొసుగును ఆధారం చేసుకుని 2014 లో ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలందరిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌నూ మింగేశారని ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment