శాలిగౌరారం: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ఆసరా పింఛన్ల కార్డులను మీటింగ్‌కు వచ్చినవారికి మాత్రమే పంపిణీ చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ అధికారులను ఆదేశించారు. శనివారం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో పర్యటించిన కిశోర్.. మొదట వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభ శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం నూతన ఆసరా పింఛన్ల మంజూరు కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
ప్రభుత్వం ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలుచేస్తుంటే.. లబ్ధిదారులు కనీసం కార్డుల పంపిణీ రోజున కూడా సమావేశాలకు హాజరుకాకపోతే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక పంచాయతీ కార్యదర్శి వెంకన్నపై పరుషపదజాలంతో వ్యాఖ్యలు చేశారు.
గ్రామానికి కొత్తగా 152 ఆసరా పింఛన్లు మంజూరైతే మీటింగ్‌కు లబ్ధిదారులందరూ రాలేదని, మీటింగ్‌కు రాని లబ్ధిదారులకు కొత్తపింఛన్ కార్డులను ఇవ్వవద్దని ఎమ్మెల్యే, పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు. తాను చెప్పిన తర్వాత కూడా కార్డులు పంపిణీ చేస్తే ‘నీ లాగు పగులుద్ది’అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలపై అటు ప్రభుత్వ ఉద్యోగులు, ఇటు ప్రజలు పెదవివిరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment