
మంథని: పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమీకృత భవన సము దాయం ప్రారంభోత్సవానికి జిల్లా ఎమ్మెల్యేగా ఒకవైపు ప్రభుత్వం నుంచి తనకు ఆహ్వానం పంపి, మరోవైపు కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమని మంథని శాసనసభ్యుడు డి.శ్రీధర్‌బాబు మండిపడ్డారు. సోమవారం పెద్దపల్లిలో సీఎం సభకు వెళ్లకుండా శ్రీధర్‌బాబును మంథనిలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయనను ఇంట్లో నుంచి బయటకు రానీయలేదు. సాయంత్రం తన అనుచరులతో కలసి ఇంటి నుంచి సీఎం సభ కోసం బయలుదేరగా పోలీసులు గేట్లు వేశారు. దీంతో పోలీసుల తీరుపై శ్రీధర్‌బాబు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త మండలాల ఏర్పాటుతోపాటు పలు అంశాలపై ముఖ్యమంత్రికి వినతిపత్రాలు ఇవ్వడానికి సిద్ధం చేసుకున్నానని తెలిపారు. ఇప్పుడు వాటిని సీఎం కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపిస్తానని చెప్పారు.