సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి ఆరేళ్లలోనే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత హోదాకు చేరుకున్నారు. 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్ పార్టిలో చేరిన ఆయన ఆరేళ్లు పూర్తి చేసుకునేలోపే అధిష్టానం మన్ననలు పొంది సీఎంగా ఎంపికయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రోజే పార్టిలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొన్న ఆయన ఇంటా, బయటా సర్దిచెప్పుకుంటూ, సర్దుబాటు చేసుకుంటూ, సై అంటే సై అంటూ హైకమాండ్ నిర్ణయించే కీలక పదవి దక్కించుకోగలిగారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా తట్టుకుంటూ హస్తం పార్టిలో ముందడుగులు వేసిన ఈ పాలమూరు నాయకుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించబోతున్నారు.
వైఫల్యాలను అధిగమిస్తూ..
కాంగ్రెస్ పార్టిలో చేరిన తర్వాత రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ముందు వరుసలోకి వచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా దక్కించుకున్న కొద్దికాలంలోనే పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టారు. పార్టిలో అసమ్మతి, ఇంటిపోరును సమర్థవంతంగా ఎదుర్కొన్న రేవంత్ అటు ప్రజాక్షేత్రంలోనూ ప్రతికూల పరిస్థితులను చవిచూశారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన అనేక ఉప ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని పార్టీ ఓటమి పాలైంది.
అయినా వైఫల్యాలకు వెరవకుండా 2023 ఎన్నికల్లో రేవంత్ అన్నీ తానై వ్యవహరించారు. అధిష్టానం నిర్ణయం మేరకు సీఎం కేసీఆర్‌పై కామారెడ్డిలో పోటీ చేసి ఢిల్లీ పెద్దల దృష్టిని కూడా ఆకర్షించారు. అటు పార్టీ కేడర్, నాయకులను ముందుకు కదిలిస్తూ ఈ ఎన్నికల్లో పార్టికి ఘనవిజయాన్ని చేకూర్చారని, అధిష్టానం వద్ద లభించిన ప్రత్యేక గుర్తింపే ఆయనకు పెద్ద పదవి లభించేలా చేసిందనే చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment