సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో తవ్వినకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఆర్‌ఎస్‌కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఈ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతి (స్వామీజీ) బీజేపీ నేత సంతోష్ (జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్)కు సమాచారమిచ్చారు. వీలైనంత త్వరగా 40మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేలా ప్రణాళిక సిద్ధంచేస్తున్నట్టు కూడా చెప్పారు.
ఈ ఏడాది ఏప్రిల్ 26న రామచంద్ర భారతి, బీజేపీ నేత సంతోష్ మధ్య జరిగిన ఈ చాటింగ్ వివరాలను సిట్ కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. రామచంద్ర భారతి, అమృత ఆస్పత్రి హెడ్ డాక్టర్ జగ్గుస్వామి మధ్య జరిగిన చాటింగ్‌లనూ సేకరించింది. ఇదే కేసులో మరో నిందితుడు నందుకుమార్ అలియాస్ నందు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 14 వరకు మిగతా నిందితులు అడ్వొకేట్ శ్రీనివాస్, ప్రతాప్, సింహ యాజీ తదితరులతో జరిపిన వాట్సాప్ సంభాషణల వివరాలనూ సిట్ సేకరించింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌తోపాటు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరేందుకు అవకాశమున్న నేతల పేర్లను నిందితులు చాటింగ్‌లలో ప్రస్తావించినట్టు పేర్కొంది.
వారందరూ.. నా సర్కిల్‌కు చెందిన వారే!
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం చాలా కాలంగా ప్రయత్నాలు సాగుతున్నట్టు ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతికి, బీజేపీ నేత సంతోష్‌కు మధ్య జరిగిన చాటింగ్‌లు వెల్లడిస్తున్నాయి. సిట్ నివేదికలోని వివరాల మేరకు.. ఈ ఏడాది ఏప్రిల్ 26న సాయంత్రం 5.30 ప్రాంతంలో ఇద్దరి మధ్య చాటింగ్ జరిగింది. అందులో ‘‘మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వారందరూ నా సర్కిల్‌కు చెందిన వారే.
ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా 40 మంది వీలైనంత త్వరగా పార్టీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తున్నాం. వారంతా ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా నేను ఎలా చెప్తే అలా నడుచుకుంటారు..’’ అని బీజేపీ సంతోష్‌కు రామచంద్ర భారతి వివరించారు. ఇక ఈ సంభాషణకు కొన్ని నిమిషాల ముందు 2022 ఏప్రిల్ 26న సాయంత్రం 4.47 గంటల సమయంలో బీజేపీ సంతోష్‌కు ఓ వ్యక్తి మెసేజీ పెట్టారు. ‘రామచంద్ర భారతి స్వామీజీ ఇక్కడ హరిద్వార్ బైఠక్‌లో మిమ్మల్ని కలిసేందుకు వచ్చారు. మిమ్మల్ని కలిసి తెలంగాణకు సంబంధించిన ముఖ్య విషయాలు చర్చించాలనుకుంటున్నారు’’ అని అందులో పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో రాజనర్సింహ!
రామచంద్ర భారతి, అమృత ఆస్పత్రి హెడ్ డాక్టర్ జగ్గుస్వామి మధ్యకూడా సెప్టెంబర్ 27న వాట్సాప్ సంభాషణ జరిగింది. ‘‘తెలంగాణకు సంబంధించి ఇటీవల ఓ కీలక పరిణామం జరిగింది. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశాన్ని సోనియాతో చర్చించే విషయంలో ఇటీవల దిగ్విజయ్ సింగ్, కేసీఆర్ నడుమ ఓ సమావేశం జరిగింది. ఇదే జరిగితే బీజేపీకి ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది.
తెలంగాణలో మూడేళ్లుగా పనిచేస్తున్న నాకు తెలిసిన ఓ బృందం ద్వారా ఈ విషయం తెలిసింది. కాంగ్రెస్‌కు వెన్నెముకగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో కాంటాక్ట్‌లో ఉన్నారు. తెలంగాణ ఏర్పాటులో కీలకంగా పనిచేసిన దామోదరకు దళితులు, రెడ్డి సామాజికవర్గంలో బలమైన అనుచరవర్గం ఉంది.
తనకు సన్నిహితంగా ఉండే ఎనిమిది మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో దామోదర టచ్‌లో ఉన్నారు. కేసీఆర్ అవినీతికి సంబంధించి ఆయనకు అనేక అంశాలు తెలుసు. 20కి పైగా నియోజకవర్గాల్లో దామోదర సామాజికవర్గానికి 75 వేల చొప్పున ఓట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. కేసీఆర్ బృందంలోని ఓ వ్యక్తి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించేందుకు అమిత్‌షాను సంప్రదించారు. ఆయన బీజేపీలోకి వస్తే ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలు పెరుగుతాయి. మీరు వీలైనంత త్వరగా సమయమిస్తే ఈ అంశంపై చర్చిద్దాం’’ అని ఆ చాటింగ్‌లో పేర్కొన్నారు.
చేరికలపై నందు వరుస సంభాషణలు
సింహయాజి, అడ్వొకేట్ శ్రీనివాస్, ప్రతాప్, విజయ్ అనే వ్యక్తులతో నందకుమార్ సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 14వరకు జరిపిన వాట్సాప్ సంభాషణ, మెసేజీలను కూడా సిట్ సేకరించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు బావమరిదిగా చెప్తున్న అడ్వొకేట్ శ్రీనివాస్‌తో పటాన్‌చెరు, తాండూరు, ఇబ్రహీంపట్నం, ఎల్‌బీనగర్, సంగారెడ్డి, జహీరాబాద్, చేవెళ్ల, పరిగి, మానకొండూరు, మంచిర్యాల, పెద్దపల్లి, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిర్మల్, భద్రాచలం, నర్సంపేట, మహబూబాబాద్, చెన్నూరు, జనగామ, ఆందోల్, నారాయణఖేడ్, మహేశ్వరం, బాన్స్‌వాడ, నిజామాబాద్ నియోజకవర్గాలు, ఎమ్మెల్యేల పేర్లను వాట్సాప్ చాటింగ్‌లో నందు ప్రస్తావించారు.
ఇక మెదక్, పెద్దపల్లి, జహీరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నల్గొండ ఎంపీ స్థానాల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. సింహయాజితో జరిగిన సంభాషణలో తన అమెరికా వీసా, ప్రతాప్‌కు, తనకు పదవి, ఇతర వ్యాపార విషయాలను నందు ప్రస్తావించారు. సింహయాజి, ప్రతాప్‌లతో జరిగిన సంభాషణలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీలో చేరేందుకు అవకాశమున్న నేతల పేర్లపైనా చర్చించారు.
స్వామీజీ.. బీఎల్ సంతోష్.. వాట్సాప్ చాటింగ్ 25 మంది రెడీ!
Published Fri, Dec 2 2022 2:49 AM | Last Updated on Fri, Dec 2 2022 2:40 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment