సాక్షి, కామారెడ్డి: అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఓ పోలీసు అధికారి కలిసి తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. ఏడాదిన్నరగా వారు పెడుతున్న టార్చర్‌తో మనశ్శాంతి కరువైందని పేర్కొంటూ ఓ తల్లి, ఆమె కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి వేధింపులపై ఎందరికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని.. కనీసం తమ చావుతోనైనా వారికి శిక్ష పడుతుందనే ఆశతో లోకం విడిచిపోతున్నామంటూ సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. తర్వాత నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన జరిగింది. సోషల్ మీడియాలో వీడియోలు, సూసైడ్ నోట్ వైరల్ కావడంతో కలకలం చెలరేగింది.
మొదట ప్రమాదమనుకుని..
శనివారం తెల్లవారుజామున పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న మహారాజ లాడ్జి 203 నంబర్ గది నుంచి పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. దీనిపై లాడ్జి నిర్వాహకులను అప్రమత్తం చేయడంతోపాటు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అగ్నిమాపక శకటం వచ్చి మంటలు ఆర్పింది. అప్పటికే గదిలో ఇద్దరు వ్యక్తులు మంటల్లో పూర్తిగా కాలిపోయి ఉన్నారు. షార్ట్ సర్క్యూట్‌తోనో, మరేదైనా కారణంతోనో ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు తొలుత భావించారు. మృతులను మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన గంగం సంతోష్ (35), ఆయన తల్లి పద్మ (65)గా గుర్తించారు. అయితే అది ప్రమాదం కాదని, తల్లీకొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారని సోషల్ మీడియాలో సంతోష్ చేసిన పోస్టులతో బయటపడింది. జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీ సోమనాథం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కామారెడ్డి పట్టణ సీఐ నరేశ్ నిందితులపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యులను రప్పించి అక్కడే పోస్టుమార్టం చేయించారు. మాంసపు ముద్దలుగా మారిన ఇద్దరి మృతదేహాలను అంబులెన్స్ ద్వారా రామాయంపేటకు తరలించారు.
ఆందోళనకు దిగిన స్థానికులు..
శనివారం సాయంత్రం సంతోష్, పద్మల మృతదేహాలను రామాయంపేటలోని స్వగృహానికి తరలించారు. అప్పటికే వందలాది మంది స్థానికులు, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. మృతదేహాలను వాహనంలో పెట్టుకుని మున్సిపల్ చైర్మన్ ఇంటివైపు బయల్దేరారు. పోలీసులు మధ్యలోనే అడ్డుకోవడంతో.. పద్మ మృతదేహాన్ని చేతులమీద మోసుకుంటూ వెళ్లి చైర్మన్ ఇంటిని ముట్టడించారు. అప్పటికే చైర్మన్, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడంతో.. బయట ఉన్న సీసీ కెమెరాలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మెదక్ ఎస్పీ, తూప్రాన్ డీఎస్పీ అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో వెనక్కితగ్గారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దీనివెనుక ఎవరున్నా సరే వదలిపెట్టం.
– బి.శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి జిల్లా ఎస్పీ
తండ్రి వైద్యం కోసం వచ్చి..
సంతోష్‌తోపాటు ఆయన తల్లి పద్మ, తండ్రి అంజయ్య ముగ్గురూ ఈ నెల 11న రామాయంపేట నుంచి కామారెడ్డికి వచ్చారు. తండ్రికి వైద్య పరీక్షలు చేయించాక మహారాజ లాడ్జిలో దిగారు. తాము రామారెడ్డి, బాసర ఆలయాలకు వెళ్లొస్తామని సంతోష్, పద్మ చెప్పడంతో.. తండ్రి అంజయ్య అదేరోజు రామాయంపేటకు తిరిగి వెళ్లిపోయారు. ఆ రోజు నుంచీ లాడ్జిలోనే ఉన్న తల్లికొడుకు.. మానసిక ప్రశాంతత కోసం రామారెడ్డిలోని ఆలయం ఉంటున్నామని కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి లాడ్జి గదిలోనే సంతోష్, పద్మ సెల్ఫీ వీడియోలు తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఆ వెంటనే కొందరు కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్ పంపినట్టు తెలుస్తోంది. సంతోష్ శనివారం తెల్లవారుజామున వీడియోలను, సూసైడ్ నోట్‌ను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. సూసైడ్ నోట్‌లోని ఆరు పేజీలపైనా తల్లికొడుకు ఇద్దరూ సంతకాలు చేశారు.
ఆ ఏడుగురి వేధింపుల వల్లే..
గంగం సంతోష్, ఆయన తల్లి పద్మ ఆత్మహత్యకు ముందు పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్‌లో తమ మరణానికి ఏడుగురు కారణమంటూ స్పష్టంగా పేర్కొన్నారు. వారి పేరు, హోదా, ఫోన్ నంబర్లనూ రాశారు. సూసైడ్‌నోట్‌లో సంతోష్, పద్మ పేర్కొన్న వివరాలివీ.. ‘‘మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, అతడి కొడుకు సరాఫ్ స్వరాజ్, ఐరేని పృథ్వీరాజ్, తోట కిరణ్, కన్నాపురం కిష్టాగౌడ్‌తోపాటు రామాయంపేటలో సీఐగా పనిచేసి బదిలీ అయిన నాగార్జునగౌడ్ (ప్రస్తుతం తుంగతుర్తి సీఐ)ల వేధింపులే మా చావుకు కారణం. ఈ ఏడుగురి మూలంగా మనశ్శాంతితోపాటు సర్వం కోల్పోయి అప్పుల పాలయ్యాను. అయినా వదలకుండా వే«ధిస్తూనే ఉన్నారు. నేను, నా కుటుంబం మానసిక ప్రశాంతతను కోల్పోయాం. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం, న్యాయం చేయాలంటూ ప్రజాప్రతినిధులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా మాకు న్యాయం జరగలేదు.
– మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ సరాఫ్ యాదగిరి, సరాఫ్ స్వరాజ్‌లు చేసే అక్రమాలు, అన్యాయాలు సహించలేక 2020 నవంబర్‌లో ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. కానీ దానికి నన్ను బాధ్యుడిని చేసి.. పథకం ప్రకారం 2020 నవంబర్ 24న అప్పటి సీఐ నాగార్జునగౌడ్ దగ్గరికి పిలిపించారు. ఆ పోస్టుతో నాకు సంబంధం లేదని చెప్పినా సీఐ వినలేదు. నా మొబైల్ తీసేసుకుని పంపించారు. దీనిపై మెదక్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో.. డిసెంబర్ 3న మొబైల్ తిరిగి ఇచ్చారు. కానీ సీఐ ఈ పది రోజుల్లో నా మొబైల్‌లో ఉన్న పర్సనల్ డేటా, వ్యాపార సమాచారాన్ని తీసుకుని మున్సిపల్ చైర్మన్‌కు ఇచ్చారు. తర్వాత నా పర్సనల్ డేటాను బయటపెడతానంటూ జితేందర్‌గౌడ్ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీనిపై డీఎస్పీ, ఎస్పీ, డీఐజీలకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లతోపాటు సీఎంవోకు ఫిర్యాదులు చేశాను. అయినా ఫలితం లేదు. నా పర్సనల్ డేటాను అడ్డుపెట్టుకుని అనేక రకాలుగా ఇబ్బందిపెట్టారు. డబ్బులు డిమాండ్ చేశారు. ఈ వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్‌తో ఆస్తులు నష్టపోయాను. చివరికి అప్పులు చేయాల్సి వచ్చింది. కుటుంబంలో మనశ్శాంతి కరువైంది. ఏడాదిన్నరగా మానసిక క్షోభ అనుభవించాం. విధిలేని పరిస్థితుల్లో మా అమ్మ, నేను చనిపోతున్నాం. ఇకనైనా అధికారులు స్పందించి మాకు అన్యాయం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం’’అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
ఎవరిదీ పాపం?
సంతోష్, పద్మల సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ ఘటనలో పాపం ఎవరిదనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. సంతోష్‌కు, రామాయంపేట మున్సిపల్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్‌లతో ఏడాదిన్నరగా గొడవలు జరుగుతున్నాయి. ఫేస్‌బుక్‌లోని పోస్టు వ్యవహారంలో వారు సంతోష్‌పై ఫిర్యాదు చేశారు. సంతోష్‌ను పిలిపించిన సీఐ నాగార్జునగౌడ్.. అతడి సెల్‌ఫోన్ తీసుకోవడం, అందులోని డేటాను అధికార పార్టీ నాయకులకు ఇవ్వడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు సంతోష్ ఎస్పీ మొదలు ఎమ్మెల్యే, మంత్రులు, సీఎం కార్యాలయం దాకా ఫిర్యాదులు చేసినా.. ఎక్కడా స్పందన రాకపోవడం ఏమిటన్న సందేహాలూ వస్తున్నాయి. సంతోష్ తనను ఏడుగురు వ్యక్తులు వేధిస్తున్నారని, తాను చనిపోతే వారే కారకులని పేర్కొంటూ ఈ ఏడాది జనవరి 13న రామాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందినట్టుగా దాని కాపీపై పోలీస్‌స్టేషన్ స్టాంప్ కూడా వేయించుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఈ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పోలీసులు సంతోష్ ఫిర్యాదు చేసినప్పుడు స్పందించినా ఫలితం ఉండేదని బంధువులు వాపోతున్నారు. పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కవడం వల్లే తమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. గంగం సంతోష్, మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్ గతంలో స్నేహితులేనని.. సంతోష్ మరికొందరితో కలిసి కొత్త వ్యాపారం ప్రారంభించడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే సంతోష్‌ను టార్గెట్ చేసి ఇబ్బందిపెట్టారని అంటున్నారు.
చదవండి: (‘బంగారు తల్లి’ అంటూ మురిసిపోయావు.. అంతలోనే ఏమైంది తల్లీ?)
Comments
Please login to add a commentAdd a comment