Telangana’s Mulugu District Receives 649 MM Rainfall in 24 Hours - Sakshi
Sakshi News home page

తెలంగాణ చరిత్రలోనే రికార్డు వర్షపాతం.. నీట మునిగిన మేడారం

Published Thu, Jul 27 2023 4:29 PM | Last Updated on Thu, Jul 27 2023 5:55 PM

Mulugu District Receives 649 MM Record Breaking Rainfall - Sakshi

సాక్షి, వరంగల్‌: రాష్ట్ర వ్యాప్తంగా  వర్ష బీభత్సం హడలెత్తిస్తోంది. అన్ని  జిల్లాలలోని మునుపెన్నడూ లేని విధంగా  అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలపై పై వరుణుడు పగబట్టాడు. వర్షాలు, వరదల ధాటికి మ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారు.‌ వారికోసం గాలింపు చర్యలు ముమ్మరం కొనసాగుతున్నాయి. 

తెలంగాణ చరిత్రలోనే అత్యంత రికార్డు వర్షపాతం ములుగు జిల్లాలో నమోదైంది. గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 649.8 మిల్లీ మీటర్లు..అంటే 64 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదవడం గమనార్హం.  లక్ష్మీదేవ్ పేట్ వద్ద 533.5 మిల్లీ మీటర్లు అంటే 53 సెంటీ మీటర్ల  వర్షపాతం రికార్డయింది. గత 24 గంటల్లో ములుగు జిల్లాలోని 35 ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్ల పైన వర్షం పడింది. 
చదవండి: పెద్దపల్లిలో నిలిచిన గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌.. తెగిపోయిన వరంగల్‌-హన్మకొండ కనెక్టివిటీ

మునిగిన మేడారం..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తాడ్వాయి మండలంలోని మేడారం నీటమునిగింది. జంపన్న వాగు రెండు వంతెనల పై నుంచి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మేడారం పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. మేడారం జాతర ప్రాంగణంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెలను జంపన్న వాగు తాకింది. 2 అడుగుల లోతు వరద నీరు చేరింది.

లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో సాయం కోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మేడారం దగ్గర్లోని పడిగాపురం గ్రామాన్ని జంపన్న వాగు చుట్టుముట్టింది, దీంతో పడిగాపురం గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. 

జలదిగ్భంధంలో గ్రామాలు
ములుగు జిల్లా మంగపేట మండల వ్యాప్తంగా జులై 27వ తేదీ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు  వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రమణక్కపేట గ్రామంలో పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరింది. దీంతో వరదలో చిక్కుకున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అటు జీవంతరావు పల్లి, పాలసావు పల్లి గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.

గత మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజన్సీ గ్రామాలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండి మత్తడి పోతున్నాయి. దీంతో వరంగల్ నుంచి ఏటూరునాగారం 163 ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు  నిలిచిపోయాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి  గుండ్ల వాగు పొంగి పస్రా తాడ్వాయి మధ్య జాతీయ రహదారిపై గండి పడింది.  దీంతో వరంగల్ వైపుకు వెళ్లే పరిస్థితి లేదు. ఏ క్షణమైనా రోడ్డు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉంది.

ఏటూరు నాగారం మండలంలోని జీడి వాగు పొంగి పార్లడంతో ఏటూరు నాగారం, బుర్గం పాడు జాతీయ రహదారి పై రాకపోకలు నిలిచిపోయాయి. మంగపేట మండలంలో వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువలు మత్తడి పోస్తున్నాయి. మంగపేట మండలంలో పంటపొలాలు  నీట మునిగాయి. శనిగాకుంట వద్ద వాగు పొంగి పొర్లడం తో  గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలంలో బొగత జలపాతం ఉదృతంగా ప్రవహిస్తుండటంతో  అటవీశాఖ అధికారులు సందర్శన నిలిపివేపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement