ముప్పిడి విఠల్ కొత్త ఒరవడి రాంనగర్‌లో ఆర్ట్ గ్యాలరీ..
ముప్పిడి విఠల్ ఓ ల్యాండ్ స్కేప్ ఆర్టిస్ట్. కొన్ని సంవత్సరాలుగా రాంనగర్‌లో ఓ ఆర్ట్ గ్యాలరీని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్పొరేట్ విత్తన సంస్థ విఠల్‌ను సంప్రదించింది. సంస్థకు చెందిన కీలక వ్యక్తి ఉద్యోగ విరమణ పొందుతున్నారు. అతడికి గతంలో ఎవరూ ఇవ్వని ప్రత్యేకమైన జ్ఞాపికను ఇవ్వాలనుకుంటున్నాము చేసి పెట్టగలరా అని అడిగారు. దీనికి మీ సంస్థ నేచర్ ఆఫ్ వర్క్ ఏమిటి? అని అడిగాడు విఠల్. దీనికి బదులుగా విత్తనాలు అమ్మే సంస్థ అని చెప్పారు. వెంటనే చేసి పెడతాను అతడి ఫోటో ఒకటి నాకు ఇవ్వండి అని చెప్పారు. అలా స్కెచ్ ఆర్టిస్ట్ నుంచి చిరుధాన్యాల ఆర్టిస్ట్‌గా మారాడు విఠల్..
ఆ వివరాలు తెలుసుకుందాం.. – ముషీరాబాద్
స్వతహాగా రైతు కుటుంబం నుంచి రావడం, సంస్థ కూడా విత్తనాలు అమ్మేది కావడం, విఠల్ కూడా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే ఆర్టిస్ట్ కావడంతో వారు చెప్పగానే వెంటనే కనెక్ట్ అయ్యాడు. విత్తనాలతోనే అతడి బొమ్మను గీసి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. వడ్లు, పెసర్లు, మినుములు, కందులు, జోన్నలు వంటి చిరుధాన్యాలే వస్తువులుగా వాడి సుమారు 15 రోజుల పాటు కష్టపడి అందమైన ఫొటోను తయారు చేసి ఇచ్చాడు. దీంతో ఈ ఫొటో వారిని అమితంగా ఆకట్టుకుంది. దీంతో ఆ సంస్థకు ఆస్థాన ఆర్టీస్టుగా మారిపోయాడు.
మలుపుతిప్పిన హర్షాబోగ్లే పెయింటింగ్..
ఆ తరువాత సంస్థ ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షాబోగ్లే సన్మాన కార్యక్రమంలో ఆయనకు కూడా ఇటువంటి వర్క్‌తో ఫొటో చేయించారు. దానికి ముఖ్య అతిథిగా హాజరైన సెంట్రల్ డైరెక్టర్ జనరల్, హర్షబోగ్లేలు ఈ ఫొటోను చూసి ఎంతో ముగ్ధులయ్యారు. ఆ తరువాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు ఇదే తరహా ఫొటోను ప్రజెంట్ చేయడంతో ఆయన కూడా ముగ్ధుడై ఇదే తరహాలో ప్రధాని నరేంద్రమోడీకి కూడా వేయాలని విఠల్‌ను కోరారు.
యూపీలోని గోరఖ్‌పూర్‌లో కిసాన్ సమాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మోడీకి అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ ముప్పిడి విఠల్ పెయింటింగ్‌నే జ్ఞాపికగా అందజేయడం దానికి మోడీ ముగ్ధుడవ్వడం గమనార్హం. ఆ తరువాత ఎలాగైనా మోడీని కలవాలనుకున్న విఠల్ మరో బొమ్మను వేసి ఇటీవల ఎల్‌బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో స్వయానా అందజేశారు. అలాగే రైతు బంధు స్కీమ్ ప్రకటించిన సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్‌కూ ఈ పెయింటింగ్ స్వయంగా అందజేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెయింటింగ్‌ను తయారు చేస్తున్నారు.
ఎలా వేస్తారు?
మొదటగా పెన్సిల్‌తోచిత్రం ఔట్ లైన్ గీసుకుని వాటిపై ఫెవికాల్ రాస్తు ఒక్కొ వడ్ల గింజను పేర్చుతాడు. శరీర రంగును బట్టి ఏ విత్తనమైతే అక్కడ సరిపోతుందో దాన్ని పేర్చుకుంటూ సైజు చూసుకుంటూ పెయింటింగ్ వేస్తాడు. అప్పుడే చిత్రం ఎలా ఉంటుందో అలా రూపుదిద్దుకుంటుంది. ఒక్కో పెయింటింగ్ వేయడానికి 15–20 రోజుల సమయం పడుతుంది. అభిమానంతో మోడీ, కేసిఆర్‌లకు మాత్రమే ఉచితంగా పెయింటింగ్ వేసి ఇచ్చారు. ఇవి ప్రస్తుతం 30–40 వేల వరకూ విక్రయిస్తున్నారు.
ఇదీ నేపథ్యం..
మెదక్ జిల్లాకు చెందిన ముప్పిడి విఠల్ తెలుగు యూనివర్సిటీలో బీఎఫ్‌ఏలో పట్టాపొందారు. ల్యాండ్ స్కేప్ పెయింటింగ్స్ వేయడంలో దిట్ట. రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన విఠల్ ఆ వాతావరణంతోనే స్ఫూర్తి పొందారు. 30 సంవత్సరాల నుంచి ఇదే రంగంలో ఉంటూ గ్రామీణ వాతావరణాన్ని పల్లెల్లో మనకు కనపడే దృశ్యాలను కనులకు కట్టినట్లు తన పెయింటింగ్స్ ద్వారా చూయించడం అతడి గొప్పతనం. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌తో పాటు పలు జాతీయ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లలో తన ల్యాండ్ స్కేప్స్‌ను ప్రదర్శనకు పెట్టి అందరి మనన్నలూ పొందారు. పలు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులను అందుకున్నారు.
చిరుధాన్యాల చిత్రాలు నా గుర్తింపు..
సహజంగా నేను ల్యాండ్ స్కేప్ ఆర్టిస్ట్‌ని. ఇదే నా జీవితం. కానీ చిరుధాన్యాలతో వేసిన చిత్రాలే గుర్తింపు తెచ్చాయి. నగరంలో ఎంతో మంది పేరుమోసిన ఆర్టిస్టులు తమ చిత్రాల ద్వారా లక్షలు, కోట్లల్లో సంపాదించిన వారు ఉన్నారు. కానీ నా చిత్రం ద్వారా ప్రధానమంత్రి వరకూ వెళ్లగలిగిన వారిలో నేను ఒక్కడినే. ఈ చిత్రాలే నాకు గుర్తింపు తెచ్చాయి. చిత్రాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాను. – ముప్పిడి విఠల్, ల్యాండ్ స్కేప్ ఆర్టిస్ట్
Comments
Please login to add a commentAdd a comment