సాక్షి, ఖమ్మం : ఒక్కసారిగా మాంసాహారం ధరలు పెరిగాయి. దీపావళి పండుగ సందర్భంగా ప్రజల వినియోగాన్ని పసిగట్టిన మాంసాహార వ్యాపారులు అనూహ్యంగా ధరలు పెంచారు. పండుగ సందర్భంగా సహజంగా మాంసాహార ప్రియులు వారికి ఇష్టమైన మాంసాన్ని తింటారు. ప్రధానంగా కొనుగోలు చేసే చికెన్, మటన్, చేపల ధరలను వ్యాపారులు పెంచారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉండేవి చికెన్, చేపలు. ఈ రెండింటి ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయి. కిలో రూ.180 వరకు పలుతున్న చికెన్ ధరను ప్రాంతాన్ని బట్టి రూ.220 నుంచి రూ.250 వరకు విక్రయించారు. అదేమిటంటే డిమాండ్ అలా ఉందని చికెన్ సెంటర్ల యజమానులు చెబుతున్నారు. గ్రామాల్లో కన్నా నగరాలు, పట్టణాల్లో చికెన్ ధర అధికంగా ఉంది. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో చికెన్‌ను రూ.250 వరకు విక్రయించారు. పరిమిత ప్రాంతాల్లో లభించే నాటు కోళ్లకు కూడా బాగా ధర పెంచారు. రూ.300 వరకు లభించే కిలో నాటుకోడి రూ.400 వరకు విక్రయించారు.
వేసవి కాలంలో, కోళ్లకు వ్యాధులు వచ్చి మరణాలు సంభవించినప్పుడు సహజంగా ధర పెరుగుతుంది. ప్రస్తుతం అటువంటిదేమీ లేనప్పటికీ ప్రజల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు కిలోకు రూ.50 వరకు పెంచారు. ఇక చేపల పరిస్థితి అదే. రకాన్ని బట్టి చేపలకు ధర ఉంటుంది. సాధారణంగా కిలో చేపల ధర రూ.150 వరకు ఉండేది. దీపావళి పండుగ సందర్భంగా కిలో రూ.180 వరకు పెంచి విక్రయించారు. వినియోగదారుల నుంచి డిమాండ్ పెరగటాన్ని గుర్తించి వ్యాపారులు ధరను అమాంతం పెంచేశారు. రొయ్యలు, కొర్రమేను వంటి చేపల ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం చేపలు పట్టే సీజన్ కాకపోవడంతో ఆంధ్రా ప్రాంతం నుంచి చేపల చెరువుల్లో పెంచే చేపలను తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇక మటన్ ధరను చెప్పుకోలేకుండా ఆకాశానికి అంటింది. కిలో రూ.800లుగా ఉన్న మటన్ ధర పండుగ సందర్భంగా రూ.1,000గా విక్రయించారు. సామాన్యులు, మధ్య తరగతి వర్గాలు మాత్రం మటన్ జోలికి వెళ్లలేని పరిస్థితి. అయినప్పటికీ దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున మటన్ విక్రయాలు జరిగాయి.
పట్టించుకోని ప్రభుత్వ శాఖలు
గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వ్యాపారులు ఎలాంటి నిబంధనలు పాటించకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా, అనుమతులు లేకుండా, ఇష్టారాజ్యంగా మాంసం విక్రయాలు జరుపుతున్నారు. నిబంధనలు పాటించకపోవటంతో పాటు ధరలను కూడా ఇష్టారీతిన పెంచి విక్రయిస్తున్నారు. స్థానికంగా నియంత్రించాల్సిన కింది స్థాయి ఉద్యోగులను లోబరుచుకొని వ్యాపారులు ఈ విక్రయాలు చేస్తున్నారు. రహదారుల వెంట, కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో మాంసం, చేపలు, చికెన్ వంటి మాంసాహారాన్ని విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పలు సందర్భాల్లో కలుషిత ఆహారం తిని పలువురు అనారోగ్యానికి గురైన ఘటనలు కూడా చోటుచేసుకున్నప్పటికీ నియంత్రించాల్సిన ప్రభుత్వ శాఖలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు, ధరలపై అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ధరలు పెంచి విక్రయిస్తున్నారు
మాంసం ధరలను బాగా పెంచారు. పండుగ పేరుతో వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచి విక్రయిస్తున్నారు. చికెన్, చేపల ధరలు అందుబాటులో ఉండేవి. వాటిని కొనుగోలు చేసే వాళ్లం. అటువంటిది వాటి ధరలు కూడా అందకుండా పోతున్నాయి.
– ఎ.వెంకటేశ్వర్లు, ప్రకాష్‌నగర్, ఖమ్మం
మాంసం ధరలు ప్రియం
మాంసం ధరలన్నీ పెరిగాయి. ప్రజల వినియోగాన్ని గమనించి ధర పెంచారు. గత వారం కన్నా దీపావళి పండుగ రోజున ధర పెరిగింది. మటన్ ధర రూ.200 వరకు పెరిగింది. చికెన్, చేపల ధరలు కూడా రూ.50 వరకు పెరిగాయి.
– నల్లమోతు లక్ష్మయ్య, గుట్టలబజార్, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment