పేద కుటుంబాలే టార్గెట్. ప్రాణాంతక వ్యాధులతో మృత్యుముఖంలోకి వెళుతున్న వారిని గుర్తించడం.. ఎలాగూ పోయేవాడే కదా నాలుగు రోజుల ముందే ఆయువు తీస్తే తప్పేముందని, డబ్బు ఆశ చూపి కుటుంబీకులను ఒప్పించడం. వారి పేరిట భారీ మొత్తానికి పాలసీ చేయించడం. ఆపై చంపేసి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించి.. బీమా క్లెయిమ్ చేసుకొని డబ్బులు పంచుకోవడం. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పకడ్బందీగా ప్లాన్ అమలు. ఇదంతా సినిమాటిక్‌గా అనిపిస్తోంది కదా? ఇది సినిమా కథే. చిత్రం పేరు ‘భద్రమ్’. దాని నుంచే ప్రేరణ పొందాడు నల్లగొండ ఇన్సూరెన్స్ కుంభకోణం నిందితుడు రాజు. అమల్లో పెట్టేశాడు. ఇంటర్ ఫెయిల్ అయినా.. నేరాల్లో మాస్టర్ మైండ్. డబ్బు యావతో ఐదుగురి ప్రాణాలను తీసేశాడు.
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఇన్సూరెన్స్ కుంభకోణంలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంటర్ ఫెయిలైన రాజు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నేరాలు చేసిన విధానం, ఆ డబ్బును పంచుకున్న తీరు, ఈ క్రమంలో ఎక్కడా ఇటు పోలీసులకుగానీ, అటు వైద్యులకు గానీ చిక్కకుండా తప్పించుకున్న విధానం చూసి పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి నిందితుడు రాజు ఇంటర్ ఫెయిల్ కానీ, నేరాలు చేయడంలో ఆరితేరాడు. గతంలో ఫైనాన్స్ సంస్థలో పనిచేసేవాడు. క్రైం సీరియళ్లు, సినిమాలు చూసి నేరప్రవృత్తిని వంటబట్టించుకున్నాడు.
ప్రాణాంతక వ్యాధులతో మరణానికి చేరువవుతున్న వారిని గుర్తించడం, వారి కుటుంబసభ్యులతో ముందే ఒప్పందం చేసుకోవడం తెలుసుకుని పోలీసులే అవాక్కయ్యారు. సాధారణ పాలసీలు అయితే చాలాకాలం వేచి చూడాలి. పైగా క్లెయిమ్ చేసుకునే సమయంలో సవాలక్ష సమాధానాలు చెప్పాలి. అదే యాక్సిడెంటల్ డెత్ పాలసీ అయితే, కేవలం ఒక ప్రీమియం కట్టేసి... మనిషిని లేపేసి డబ్బులు జేబులో వేసుకోవచ్చన్న దుష్టాలోచనతో అడుగులేశాడు. చట్టాల్లోని చిన్న చిన్న లోపాలను బాగా అధ్యయనం చేసి... వాటిని వాడుకొని మనుషుల ప్రాణాలను తీసి, అక్రమంగా ఎదిగేందుకు ప్రణాళికలు రచించాడు.
తక్కువ ప్రీమియంతో... భారీగా డబ్బు
2013లో సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్‌కు చెందిన సపావత్ సక్రియా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమీప బంధువులే కావడంతో సక్రియా కుటుంబాన్ని నిందితుడు ధీరావత్ రాజు సంప్రదించాడు. చనిపోయిన వ్యక్తి బతికున్నట్లుగా పంచాయతీ కార్యదర్శి సాయంతో పత్రాలు సృష్టించి, ఆ తరువాత డెత్ సర్టిఫికెట్ తీసుకుని చనిపోయాడని రూ.1.4 లక్షల బీమా క్లెయిమ్ చేసుకున్నాడు. ఆ పథకం విజయవంతంగా అమలైంది.
అది మొదలు రాజులో దుర్భుద్ధి పుట్టింది. కానీ, ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాలేదు. 2014లో తొలి బీమా హత్య చేసే వరకు అతను దాదాపు 6 నుంచి 10 నెలలపాటు ఖాళీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఏం చేశాడు? అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 2014లో విడుదలైన తమిళ డబ్బింగ్ సినిమా ‘భద్రమ్’ను నిందితుడు చూశాడు. యాక్సిడెంట్ పాలసీ చేయించి, అమాయకులను చంపి, రోడ్డు ప్రమాదాలుగా చిత్రించి, బీమా డబ్బులను క్లెయిమ్ చేసుకునే రాకెట్ నేపథ్యంతో సాగే కథ ఇది. ఇలాంటి నేపథ్యాలతో సాగిన సినిమాలతోనే నిందితుడు రాజు ప్రేరణ పొందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే సాధారణ బీమా చేయిస్తే.. అది అంత త్వరగా వర్తించదు.
అదే యాక్సిడెంటల్ డెత్ పాలసీ తీసుకుంటే తీసుకున్న మరునాడే మరణించినా.. పూర్తిస్థాయి డబ్బులు వస్తాయి. ఏడాది కాలానికే వర్తించే యాక్సిడెంటల్ డెత్ పాలసీల్లో తక్కువ ప్రీమియంతో (కట్టిన ప్రీమియం వెనక్కిరాదు) ఎక్కువ రిస్క్ కవరేజి ఉంటుంది. ఇక్కడే రాజు తన తెలివితేటలు ప్రదర్శించాడు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) కొత్త నిబంధన ప్రకారం.. భార్య, రక్త సంబంధీకులకు తప్ప ఇతరులకు బీమా క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. అందుకే నామినీగా పెట్టేవారితో (కుటుంబీకులతో) రాజు ముందే ఒప్పందం చేసుకునే వాడు. బీమా డబ్బు రాగానే అనుకున్న ప్రకారం వాటాలు పంచుకునేవాడు.
నాగార్జునసాగర్‌లో మరో కుంభకోణం
నల్లగొండలో ఈ ఇన్సూరెన్స్ హత్యల దర్యాప్తు సాగుతుండగానే.. మరో బీమా కుంభకోణాన్ని నల్లగొండ పోలీసులు ఛేదించారు. నాగార్జునసాగర్‌లో ఆరేళ్ల క్రితం మామను యాక్సిడెంట్ పాలసీ చేయించి చంపిన అల్లుడి దుష్టపన్నాగం ఇది. ఇందులో నిందితుడు తన మామ పేరిట మూడు భారీ వాహనాలు కొనుగోలు చేయించాడు. ఆ మూడింటికి యజమాని మరణిస్తే.. నెలనెలా వాయిదాలు కట్టకుండా రద్దయిపోయేలా బీమా చేయించాడు. ఆ తరువాత మామకు భారీ మొత్తానికి యాక్సిడెంట్ పాలసీ చేయించాడు. అనంతరం ఇంకో అడుగు ముందుకేశాడు.
ఇంకా తెలివిగా ఓ ప్రముఖ బ్యాంకులో మామకు ఖాతా తెరిపించాడు. ఈ బ్యాంకు నిబంధనల ప్రకారం.. ఖాతాదారులకు యాక్సిడెంటల్ పాలసీని వర్తింపజేస్తారు. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా మామను హతమార్చి ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈ కేసులో అల్లుడు యాక్సిడెంట్ పాలసీ కింద భారీ మొత్తాన్ని రాబట్టుకున్నాడు. పైగా మూడు భారీ వాహనాలకు నెల వాయిదాలు రద్దు అయ్యాయి. మరోవైపు బ్యాంకు వాళ్లు తమ ఖాతాదారుడు చనిపోయాడని బీమా సొమ్ము అందజేశారు. ఈ విధంగా ఐదు పాలసీల నుంచి లబ్ది పొందాడు. చదవండి: (దారుణం: బీమా చేయించారు.. 8 మందిని చంపేశారు)
ఐఐబీకి రంగనాథ్ లేఖ
ఈ వ్యవహారంలో మరిన్ని అక్రమాలు దాగి ఉన్నాయన్న అనుమానంతో వాటిపై కూపీలాగేందుకు నల్లగొండ ఎస్పీ, డీఐజీ ఏవీ రంగనాథ్ నడుం బిగించారు. గత పదేళ్లలో నల్లగొండ జిల్లాలో బీమా చేసిన ఏడాదిలోగా క్లెయిమ్ అయిన పాలసీల వివరాలు వెల్లడించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఐఐబీ)కి లేఖ రాశారు. ఈ సంస్థ అందించే వివరాల ఆధారంగా అనుమానాస్పద కేసులను తవ్వి తీయాలని నిర్ణయించారు. గత కేసుల సమయంలో పోలీసులు, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా? లేక నిందితులతో సంబంధాలున్నాయా? అన్న విషయంలోనూ సమగ్ర దర్యాప్తు చేయనున్నారు.
నిందితుడు ధీరావత్ రాజు ఇంటర్ ఫెయిలైనా.. క్రిమినల్ మైండ్‌లో మాత్రం మాస్టర్ అని, అతను ఇవి కాకుండా ఇంకా కొన్ని నేరాలు చేశాడా? లేక ఇతని సలహాలు, సూచనలతో ఇలాంటి నేరాలు ఉమ్మడి జిల్లాలో ఇంకా ఎక్కడైనా జరిగాయా? అన్న కోణంలోనూ డీఐజీ కూపీ లాగుతున్నారు. మొత్తంగా ఈ ముఠా ఇప్పటిదాకా ఐదుగురిని హతమార్చి, చనిపోయిన ఇద్దరి శవాలను తీసుకెళ్లి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించి బీమా డబ్బులు తీసుకుంది. మరో ఇద్దరిని చంపేందుకు ప్లాన్ చేసింది. వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉంది.
ఏపీలో రెండుసార్లు విఫలం... రెండేళ్లు జైలులో
నిందితుడు రాజు పోలీసులకు విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు సమాచారం. 2017లోనే దేవిరెడ్డి కోటిరెడ్డి హత్యకు ప్లాన్ చేశాడు. ఈ మేరకు అతని భార్యను సంప్రదించి ఒప్పించాడు. అదే సమయంలో అతని స్నేహితులు ఏపీలోని ప్రకాశం జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి విషయంలోనూ ఇలాగే ఇన్సూరెన్స్ చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని కోరారు.
ఆ క్రమంలో అనారోగ్యంతో మరణించిన వ్యక్తి శవాన్ని తీసుకెళ్లి రోడ్డు ప్రమాదమని నమ్మబలికేందుకు రాజు యత్నించాడు. కానీ, వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమివ్వడంతో రాజు జైలుకెళ్లాడు. ఆ తరువాత గుంటూరు జిల్లా దాచేపల్లిలోనూ మృతదేహాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే క్రమంలోనూ విఫలమయ్యాడు. దీంతో దాదాపు రెండేళ్ల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. విడుదలయ్యాక తిరిగి దామరచర్లకు వచ్చాడు. ఈలోపు కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో కోటిరెడ్డి హత్యలో మరింత జాప్యం జరిగింది.
లాక్‌డౌన్ ఎత్తివేయగానే తిరిగి కోటిరెడ్డి పేరిట పలు ప్రైవేటు బీమా కంపెనీల నుంచి రూ.1.20 కోట్ల ఇన్సూరెన్సులు తీసుకున్నాడు. మొత్తానికి, కోటిరెడ్డిని చంపేందుకు 2017లోనే అవగాహన కుదిరినా.. దాన్ని అమలు చేసేందుకు 2021 వరకు సమయం పట్టిందని సమాచారం. ఈ అన్ని కేసులను రాజు క్షుణ్నంగా అధ్యయనం చేయడం గమనార్హం. వ్యక్తిని చంపాక పోలీసులు ఘటనాస్థలానికి రావడం, పంచనామా సమయంలో ఏయే ఆధారాలను నోట్ చేసుకుంటున్నారు?
ఏయే అంశాల ఆధారంగా రోడ్ యాక్సిడెంట్ అని నమ్ముతున్నారు అన్న విషయాలను పోలీసుల పక్కనే ఉండి నిందితుడు అధ్యయనం చేసినట్లు విచారణలో వెల్లడించడంతో పోలీసులు విస్మయం చెందారు. అందుకే, వ్యక్తులను చంపాక.. ఒకటికి రెండుసార్లు వాహనాలను వారి శరీరాలపై ఎక్కించడం, టైర్‌మార్కులు, వాహనం వచ్చిన డైరెక్షన్.. తదితర అంశాలను కచ్చితంగా పాటించి చూడగానే అది యాక్సిడెంట్ అనిపించేలా పకడ్బందీగా వ్యవహరించాడని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment