ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నివారించి కూలీలకు స్థానికంగా పని కల్పించడమే లక్ష్యంగా అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి పథకం రాష్ట్రంలో నీరుగారి పోతోంది. ఈ పథకం పనులకు వచ్చే కూలీల సంఖ్య భారీగా తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనం. గతేడాదితో పోల్చితే ఈ పనులకు వెళ్తున్న కూలీల సంఖ్య 25 శాతానికి పడిపోవడం గమనార్హం.
గతేడాది 2022 జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీల సంఖ్య 3,23,028 మంది కాగా, మంగళవారం (2023 జనవరి 3న) రోజు పనులకు హాజరైన కూలీల సంఖ్య కేవలం 72,371 అంటేనే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ పనులు చేసేందుకు కూలీల్లో ఆసక్తి తగ్గుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రోజు వారీ కూలీ సగటున రూ.211
ఉపాధి హామీ పనులు చేసిన వారికి సకాలంలో కూలీ డబ్బులు అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా కూలీలకు 15 రోజుల్లో కూలీ డబ్బులు చెల్లించాలి. కానీ నెలల తరబడి చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది.
►కొందరు కూలీలకు గతేడాది ఆగస్టు నుంచి డబ్బులు రాలేదు. ఈ డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
►ఉపాధి పనులకు వెళితే కూలీ గిట్టుబాటు కాకపోవడము కూడా కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉపాధి కూలీలకు రోజుకు సగటున రూ.211లు వస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ కూలీలకు డిమాండ్ అధికంగా ఉంది. రబీ పంటలు.. వరి నాట్లు, పత్తి తీయడం వంటి పనులకు వెళితే ఇంతకు రెండింతలు కూలీ గిట్టుబాటు అవుతోంది.
►మారుతున్న నిబంధనలు కూడా ఓ కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పనులకు వెళుతున్న కూలీలు ప్రత్యేక యాప్‌లో రెండు పూటలా ఫొటోలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే సెల్‌ఫోన్ నెట్‌వర్క్ లేని చోట్ల ఈ ప్రక్రియ వీలు కావడం లేదు.
66 లక్షల మంది కూలీలు.. రూ.2,841 కోట్ల పనులు..
రాష్ట్ర వ్యాప్తంగా 56.74 లక్షల జాబ్‌కార్డులుండగా, మొత్తం 1.18 కోట్ల మంది కూలీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 37.09 లక్షలు యాక్టివ్ జాబ్‌కార్డులు కార్డుదారులు కాగా, 66.44 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 2022–23లో ఇప్పటి వరకు రూ. 2,841.17 కోట్ల మేరకు ఉపాధి హామీ పనులు జరిగాయి. ఇందులో కూలీలకు చెల్లించిన వేతనం రూ.1,791.10 కోట్లు కాగా, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.875.35 కోట్లు ఖర్చు చేశారు.
సెప్టెంబర్‌లో చేసిన పనికి ఇంకా డబ్బులు రాలే..
గతేడాది సెప్టెంబర్‌లో గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లాను. ఇప్పటికీ కూలీ డబ్బులు రాలేదు. ఎప్పుడు ఇస్తారోనని ఎదురు చూస్తున్నాను. అధికారులను ఎన్నిమార్లు అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది.
– భూమయ్య, ఉపాధి కూలీ, జంబిగి, సంగారెడ్డి జిల్లా
ఇతర పనులకు వెళ్తున్నాం..
సరిగ్గా డబ్బులు రాకపోవడంతో ఉపాధి పనులకు వెళ్లడం లేదు. ఇతర వ్యవసాయ పనులకు వెళుతున్నాం. సెప్టెంబర్‌లో చేసిన పనులకే ఇంకా కూలీ డబ్బులు రాలేదు. పనులు చేసుకుంటేనే పూట గడిచే మాకు వెంటనే కూలీ డబ్బులు చెల్లించాలి.
– మణెమ్మ, ఉపాధి కూలీ,జంబిగి, సంగారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment