National Rural Employment Scheme
-
ఉపాధి కెళ్లినా డబ్బులు రావడంలే
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నివారించి కూలీలకు స్థానికంగా పని కల్పించడమే లక్ష్యంగా అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి పథకం రాష్ట్రంలో నీరుగారి పోతోంది. ఈ పథకం పనులకు వచ్చే కూలీల సంఖ్య భారీగా తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనం. గతేడాదితో పోల్చితే ఈ పనులకు వెళ్తున్న కూలీల సంఖ్య 25 శాతానికి పడిపోవడం గమనార్హం. గతేడాది 2022 జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీల సంఖ్య 3,23,028 మంది కాగా, మంగళవారం (2023 జనవరి 3న) రోజు పనులకు హాజరైన కూలీల సంఖ్య కేవలం 72,371 అంటేనే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఈ పనులు చేసేందుకు కూలీల్లో ఆసక్తి తగ్గుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోజు వారీ కూలీ సగటున రూ.211 ఉపాధి హామీ పనులు చేసిన వారికి సకాలంలో కూలీ డబ్బులు అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా కూలీలకు 15 రోజుల్లో కూలీ డబ్బులు చెల్లించాలి. కానీ నెలల తరబడి చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ►కొందరు కూలీలకు గతేడాది ఆగస్టు నుంచి డబ్బులు రాలేదు. ఈ డబ్బుల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ►ఉపాధి పనులకు వెళితే కూలీ గిట్టుబాటు కాకపోవడము కూడా కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉపాధి కూలీలకు రోజుకు సగటున రూ.211లు వస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ కూలీలకు డిమాండ్ అధికంగా ఉంది. రబీ పంటలు.. వరి నాట్లు, పత్తి తీయడం వంటి పనులకు వెళితే ఇంతకు రెండింతలు కూలీ గిట్టుబాటు అవుతోంది. ►మారుతున్న నిబంధనలు కూడా ఓ కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పనులకు వెళుతున్న కూలీలు ప్రత్యేక యాప్‌లో రెండు పూటలా ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే సెల్‌ఫోన్ నెట్వర్క్ లేని చోట్ల ఈ ప్రక్రియ వీలు కావడం లేదు. 66 లక్షల మంది కూలీలు.. రూ.2,841 కోట్ల పనులు.. రాష్ట్ర వ్యాప్తంగా 56.74 లక్షల జాబ్‌కార్డులుండగా, మొత్తం 1.18 కోట్ల మంది కూలీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 37.09 లక్షలు యాక్టివ్ జాబ్‌కార్డులు కార్డుదారులు కాగా, 66.44 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 2022–23లో ఇప్పటి వరకు రూ. 2,841.17 కోట్ల మేరకు ఉపాధి హామీ పనులు జరిగాయి. ఇందులో కూలీలకు చెల్లించిన వేతనం రూ.1,791.10 కోట్లు కాగా, మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.875.35 కోట్లు ఖర్చు చేశారు. సెప్టెంబర్‌లో చేసిన పనికి ఇంకా డబ్బులు రాలే.. గతేడాది సెప్టెంబర్‌లో గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లాను. ఇప్పటికీ కూలీ డబ్బులు రాలేదు. ఎప్పుడు ఇస్తారోనని ఎదురు చూస్తున్నాను. అధికారులను ఎన్నిమార్లు అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. – భూమయ్య, ఉపాధి కూలీ, జంబిగి, సంగారెడ్డి జిల్లా ఇతర పనులకు వెళ్తున్నాం.. సరిగ్గా డబ్బులు రాకపోవడంతో ఉపాధి పనులకు వెళ్లడం లేదు. ఇతర వ్యవసాయ పనులకు వెళుతున్నాం. సెప్టెంబర్‌లో చేసిన పనులకే ఇంకా కూలీ డబ్బులు రాలేదు. పనులు చేసుకుంటేనే పూట గడిచే మాకు వెంటనే కూలీ డబ్బులు చెల్లించాలి. – మణెమ్మ, ఉపాధి కూలీ,జంబిగి, సంగారెడ్డి జిల్లా -
‘ఉపాధి’లో జిల్లాకు ప్రథమ స్థానం
విజయనగరం కంటోన్మెంట్: జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా పని దినాలు కల్పించడంలో రాష్ర్టస్థాయిలో జిల్లా ప్రథమ స్థానం సాధించిందని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎస్పీ టక్కర్ పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1.98 లక్షల పనిదినాలు కల్పించడంతో రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంఎం నాయక్‌ను ఆయన అభినందించారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కూడా బాగుందని కితాబునిచ్చారు. జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.65 వేల కోట్లు కేటాయించినందున అవసరమయిన భూ సేకరణ ప్రక్రియను మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. ఈ-ఆఫీసు అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15 శాతం గ్రోత్‌రేటు సాధన దిశలో ప్రణాళికాయుతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంట సంజీవని కార్యక్రమం వేగం పుంజుకోవాలన్నారు. తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. క్రాస్ ప్రోగ్రాం పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పట్టణ గృహ నిర్మాణ పథకం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు భూములను గుర్తించి లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సీఎస్‌తో మాట్లాడుతూ నాలుగు మున్సిపాలిటీల్లో 200 ఎకరాల భూమి లభ్యంగా ఉందన్నారు. లబ్ధిదారుల ఎంపిక చేపడతామని చెప్పారు. వ్యక్తిగత పార్శిళ్ల కింద 80 ఎకరాలు ఉందని తెలిపారు. జిల్లాలో రోజుకు 4.98 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతోందని వివరించారు. ఇప్పటివరకూ 210 కిలోమీటర్ల మేర రహదారులు పూర్తి చేశామన్నారు. సమీక్షలో సీసీఎల్ఏ జవహర్ రెడ్డి, పీఆర్ సెక్రటరీ లవ్ అగర్వాల్, కమిషనర్ బి.రామాంజనేయులు, జేసీ శ్రీకేశ్ బి లట్కర్, సీపీఓ విజయలక్ష్మి, డ్వామా పీడీ ప్రశాంతి, పరిశ్రమల శాఖ మేనేజర్ ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కూలీలకు నిలిచిన వేతనాలు
మంచిర్యాల రూరల్ : జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. కోత లేకుండా చెల్లించేందుకు యాక్సిస్ బ్యాంక్ ద్వారా సీఎస్పీ వ్యవస్థను ఈ ఏడాది జనవరిలో ప్రవేశపెట్టగా వీరు గ్రామాల్లోనే ప్రతీనెల వేతనాలు చెల్లించేలా కూలీల వేలిముద్రలు, ఐరిస్‌లు సేకరించారు. ఈజీఎస్ నుంచి యాక్సిస్ బ్యాంక్‌కు కూలీల వేతనాల డబ్బులు జమచేసినా నెలల తరబడి బ్యాంక్ అధికారులు గానీ, సీఎస్పీలు గానీ చెల్లించకుండా తాత్సారం చేస్తూ వచ్చారు. కుంటి సాకులతో జాప్యం.. బయోమెట్రిక్ విధానం ద్వారా చేపట్టే చెల్లింపుల్లో వేలిముద్రలు సరిగా లేవని, ఆధార్‌తో అనుసంధానం కాలేదని ఇలా రకరకాల కారణాలతో చెల్లింపుల్లో జాప్యం చేస్తూ వచ్చారు. 14 రోజులకోసారి చేపట్టాల్సిన చెల్లింపులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండడంతో డ్వామా పీడీ గణేశ్‌జాదవ్ గ్రామీణాభివృద్ధి శాఖకు వేతనాల చెల్లింపులో యాక్సిస్ బ్యాంక్ విఫలమైనట్లు లేఖ రాశారు. కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పనులు నిలిచిపోతున్నాయని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆయన లేఖ రాయడంతో గత నెలలో యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఈజీఎస్ చెల్లింపులను ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటికే యాక్సిస్ బ్యాంక్‌కు జమచేసిన కూలీల వేతనాలను బ్యాంక్ వారు తిరిగి గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించారు. నగదు చెల్లింపులను నేరుగా చెల్లించే వీలు లేకపోవడంతో, కూలీల ఖాతాల్లోకి వారి వేతనాలను ఆన్లైన్ ద్వారా జమ చేయాలని కూలీల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు సేకరిస్తున్నారు. అయితే చాలా మంది కూలీలకు బ్యాంక్ ఖాతాలు లేకపోవడంతో, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ ధన్ యోజన పథకం ద్వారా జీరో బ్యాలెన్స్ ఖాతాలను కూలీలతో తెరిపిస్తున్నారు. కూలీల ఖాతాలు తెరిచి, వాటిని ఆన్లైన్ ద్వారా నమోదు పూర్తి చేస్తేనే కూలీలకు వేతనాలు అందే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో పదిహేను రోజుల సమయం పట్టనుండడంతో ఈ నెలలోనైనా వేతనాలు అందుతాయో లేదోనని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బయోమెట్రిక్ చెల్లింపులు లేనట్లే.. ఉపాధిహామీ కూలీలకు చెల్లించే వేతనాల్లో ఎలాంటి అవినీతి ఉండొద్దని, ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాలోని 18 మండలాల్లో యాక్సిస్ బ్యాంక్, 34 మండలాల్లో పోస్టాఫీసు ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. వీరు గ్రామాల్లోని కూలీలకు వేతనాలు చెల్లించేందుకు సీఎస్పీలను నియమించి బయోమెట్రిక్ ద్వారా వేతనాలు కూలీలకు నేరుగా వేతనాలను అందించేవారు. పోస్టాఫీస్ ద్వారా 34 మండలాల్లో అందిస్తున్న వేతనాల్లో ఇబ్బందులు లేకున్నా, యాక్సిస్ బ్యాంక్ నుంచి ప్రతీ నెలా కూలీలకు వేతనాలు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చింది. ప్రతీరోజు చెల్లింపుల వివరాలను డ్వామా అధికారులకు అందించకపోవడంతో, ఎంత మంది కూలీలకు వేతనాలు అందాయో? ఎన్ని పెండింగులో ఉన్నాయనే విషయంలో అధికారులకు స్పష్టత లేకుండా పోయింది. నిత్యం ఈజీఎస్ కార్యాలయాలకు కూలీలు చేరుకుని ధర్నా చేయడం, ఆందోళనతో సిబ్బందిని నిర్భందించడం లాంటి ఆందోళనలు చేపట్టారు. 18 మండలాల్లో యాక్సిస్ బ్యాంక్‌తో ఉన్న ఒప్పందాన్ని డ్వామా అధికారులు రద్దు చేసుకున్నారు. దీంతో 2.26 లక్షల మంది కూలీలు రూ. 4.34 కోట్ల రూపాయల వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. కూలీల వేతనాలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమచేసేందుకు, కూలీల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల నంబర్లను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు కూలీలను ఇబ్బందులకు గురిచేసిన బయోమెట్రిక్ ద్వారా కూలీల చెల్లింపులు నిలిచిపోవడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధిరేటు పెరిగింది: జైపాల్‌రెడ్డి
హైదరాబాద్, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి రేటు పెరిగిందని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్ నాక్ ఆడిటోరియంలో నిర్మాణ రంగంపై 4 రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ, నిర్మాణ రంగంలో సమస్యలను దేశం అధిగమిస్తుందని తెలిపారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో నిర్మాణ రంగ సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. దేశంలో ఇసుక సమస్య తీవ్రంగా ఉందని, ఇసుక తరలింపు వ్యవహారంలో ఘర్షణలు మాఫియాను తలపిస్తున్నాయని అన్నారు. సహజ వనరులను ఎక్కువగా వినియోగిస్తే పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం గ్రామాల్లో ఆర్థికాభివృద్దికి తోడ్పడిందన్నారు. దీన్ని ప్రపంచదేశాలు మెచ్చుకున్నాయన్నారు. మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ నిర్మాణ సంస్థల మధ్య సమన్వయం అవసరమని సూచించారు. మెట్రో ప్రాజెక్టు రాష్ట్రానికి రావడంలో జైపాల్‌రెడ్డి కీలక ప్రాత పోషించారన్నారు. కార్యక్రమంలో ఐసీఐ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్పీ అంచూరీ, అధ్యక్షుడు జోష్కురియన్, సైంటిఫిక్కమిటీ కన్వీనర్ విజయ్కులకర్ణి, యూఎస్ఏ వరల్డ్‌కాంగ్రెస్ ప్రతినిధి థామ్ సిండ్రిక్ తదితరులు పాల్గొన్నారు.