
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాలలో కార్పొరేట్ బ్యూటీ సెలూన్ ఏర్పాటును నిరసిస్తూ క్షౌరవృత్తిదారులు చేపట్టిన నిరసనలు తీవ్రతరం చేస్తామని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక ప్రకటించింది. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటుకానున్న కార్పొరేట్ బ్యూటీ సెలూన్‌ను వ్యతిరేకిస్తూ జనవరి 21 నుంచి క్షౌరవృత్తిదారులు దుకాణాలు మూసివేసి రిలే నిరాహారదీక్షలు చేస్తున్నా ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడం శోచనీయమని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ అన్నారు.
భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసేందుకు ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ అత్యవసరంగా సమావేశమైందని, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 3న (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా క్షౌరశాలలు మూసివేసి నిరసన తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. కార్పొరేట్ శక్తులు తమ పొట్టగొట్టడాన్ని వ్యతిరేకిస్తూ క్షౌరవృత్తిదారులు నిద్రాహారాలు మాని పది రోజులుగా నిరసనలు చేస్తున్నా పాలక యంత్రాంగం నుంచి కనీస స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. ఫిబ్రవరి 3న జరగనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని క్షౌరవృత్తిదారులకు ఆయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment