
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నేతృత్వంలోని నిపుణుల బృందం తనిఖీ చేయనుంది. మంగళవారం నుంచి 8వ తేదీ వరకు శ్రీశైలం ప్రాజెక్టును, 13–15 తేదీల్లో నాగార్జునసాగర్‌ను ఎన్డీఎస్‌ఏ బృందం సందర్శించనుంది. గత నెల 9న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో తెలంగాణ, ఏపీతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టనుంది. ఎన్డీఎస్‌ఏ సభ్యుడు (డిజాస్టర్, రిసిలియన్స్) వివేక్ త్రిపాఠి నేతృత్వంలోని బృందం శ్రీశైలం ప్రాజెక్ట్‌ను, ఎన్డీఎస్‌ఏ సాంకేతిక సభ్యుడు రాకేశ్ కశ్యప్ నేతృత్వంలోని బృందం సాగర్ ప్రాజెక్టును తనిఖీ చేయనుంది.
ఈ బృందంలో ఎన్డీఎస్‌ఏ నుంచి ముగ్గురు, సీడబ్ల్యూసీ, కేఆర్‌ఎంబీ, ఏపీ, సీఎస్‌ఎంఆర్‌ఎస్, తెలంగాణ నుంచి చెరో అధికారి కలిపి మొత్తం ఎని మిది మంది సభ్యులు ఉండనున్నారు. శ్రీశైలం ప్రా జెక్టు నుంచి భారీగా వరద విడుదల చేస్తుండటంతో దిగువ భాగంలో 40 మీటర్లలోతు గుంత (ప్లజ్ పూల్) ఏర్పడింది. దిగువ భాగంలో రక్షణ చర్యలతోపాటు కాంక్రీట్ వాల్ నిర్మాణం, స్పిల్ వేకు అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుందని, దీనికి రూ. 800 కోట్లు అవసరమని కేఆర్‌ఎంబీ గతంలో అంచనా వేసింది.
ఇక నాగార్జునసాగర్ స్పిల్‌వే ఓగీలో కాంక్రీట్ పనులు, సీపేజీ గుంతలకు మరమ్మతులు, కుడికాలువ హెడ్ రెగ్యూలేటరీ గేట్లకు మరమ్మతులు, పూడికను బయటకు పంపే గేటు మారి్పడి వంటి పనులు చేయాల్సి ఉందని కేఆర్‌ఎంబీ ఇప్పటికే గుర్తించింది. ఇందుకు రూ. 20 వేల కోట్లు అవసరం కానున్నాయి. ఎన్డీఎస్‌ఏ బృందం తనిఖీల అనంతరం రెండు ప్రాజెక్టుల మరమ్మతులపై కేఆర్‌ఎంబీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment