అలలపై పడవ ప్రయాణం.. సహజ నీరా పానీయం | Neera Cafe will start tomorrow on the banks of Sagar | Sakshi
Sakshi News home page

అలలపై పడవ ప్రయాణం.. సహజ నీరా పానీయం

Published Tue, May 2 2023 4:49 AM | Last Updated on Tue, May 2 2023 9:29 AM

Neera Cafe will start tomorrow on the banks of Sagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాగర తీరం మరో ఆతిథ్యానికి సన్నద్ధమైంది. సహజమైన నీరాతో పాటు తెలంగాణ రుచులను అందజేసే నీరా కేఫ్‌ ప్రారంబో త్సవానికి సర్వం సన్నద్ధమైంది. పర్యా­టక, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో రూపుదిద్దుకున్న నీరా కేఫ్‌ను ఈ నెల 3వ తేదీన ప్రారంభించనున్నారు. హుస్సేన్‌సాగర్‌  ఒడ్డున ఏర్పాటు చేసిన నీరాకేఫ్‌ నగరవాసులకు సరికొత్త అనుభూతినివ్వనుంది.

ఇక్కడి నుంచి సాగర్‌లో విహరించేందుకు పర్యాటకశాఖ బోటు షికారును కూడా అందుబాటులోకి తెచ్చింది. పీపుల్స్‌ప్లాజా వైపు వచ్చే సందర్శకులు నీరా సేవనంతో పాటు పడవ ప్రయాణం కూడా చే­యవచ్చు. తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృ­తి సిద్ధమైన నీరా పానీయాన్ని  నగరవాసులకు అందించేందుకు ఎక్సైజ్‌ శాఖ సుమారు రూ.10 కోట్లతో నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ప్లాజా సమీపంలో ఈ కేఫ్‌ను నిర్మించింది.  

ఆకర్షణీయంగా భవనం..  
నీరాభవనం తాటాకుతో చేసిన రేక ఆకృతిలో ఎంతో ఆకర్షణీయంగా నిర్మించారు. పల్లెల్లో తాటి, ఈత కల్లును తాటాకులతో చేసిన రేకలు, మోదుగాకు డొప్ప(దొన్నె)లలో సేవించడానికి ఇష్టపడతారు. ఇలా ఆకుల్లో తాగడం వల్ల పానీయం సహజత్వం ఏ మాత్రం కోల్పోకుండా ఉంటుంది. అలాంటి తాటాకు రేక కప్పినట్టుగా నీరా భవనాన్ని నిర్మించడం విశేషం. తెలంగాణ పల్లెలను తలపిస్తూ అందమైన మ్యూరల్స్, చేతివృత్తులను ప్రతిబింబించే శిల్పాలతో భవనం ప్రాంగణాన్ని రూపొందించారు.

ఈ కేఫ్‌లో మొత్తం ఏడు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక కౌంటర్‌ను పూర్తిగా నీరా కోసం కేటాయించగా మిగతా ఆరింటిలో వివిధ రకాల ఆహార పదార్ధాలు, ఐస్‌క్రీమ్‌లు, బిర్యానీలు లభిస్తాయి. హుస్సేన్‌ సాగర్‌ జలాలను, పోటెత్తే అలలను వీక్షిస్తూ నచ్చిన రుచులను ఆస్వాదించవచ్చు.

ఇందుకనుగుణంగా సీటింగ్‌ సదుపాయం ఉంటుందని పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారి ఒకరు తెలిపారు. భవనం మొదటి అంతస్థులో ఉన్న విశాలమైన హాల్లో పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి వేడుకలు నిర్వహించుకోవచ్చు. విందులు ఏర్పాటు చేసుకొనే సదుపాయం కూడా ఉంటుంది. 

ఆరోగ్య ప్రదాయిని.... 
తాటి, ఈత చెట్ల నుంచి తెల్లవారుజామునే సేకరించే నీరాలోని సహజమైన పోషకవిలువలు ఏ మాత్రం పోకుండా శీతలీకరణ పద్ధతిలో నిల్వ చేసి విక్రయిస్తారు. ఇందుకోసం నీరా భవనంలో ప్రత్యేక శీతలీకరణ యంత్రాలను ఏర్పాటు చేశారు. భువనగిరి సమీపంలోని నందనం, కడ్తాల్‌ సమీపంలోని ముది్వన్‌లో ఏర్పాటు చేసిన తాటివనాల్లో నీరా కోసమే ప్రత్యేకంగా పెంచిన తాటి, ఈత చెట్ల నుంచి నీరా సేకరిస్తారు. దాంతోనే అనుబంధ ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నారు.

‘పానీయంలోని స్వచ్ఛతకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు.. తాటి చెట్ల నుంచి నీరాను సేకరించడం మొదలు.. దానిని వినియోగదారులకు చేర్చడంవరకు పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిని పాటిస్తున్నాం’అని నిర్వాహకులు తెలిపారు. నీరాలో శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు, మినరల్స్‌ లభిస్తాయి.

నీరాతో పాటు తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరా ద్వారా తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను కూడా విక్రయించనున్నారు. ఆడ, మగ(పోద్దాడు, పరుపుదాడు) తాటి చెట్ల నుంచి సేకరించే రెండు రకాల తాటి బెల్లం కూడా ఇక్కడ లభించనుంది.  

ఆహార ఉత్పత్తులు            ధర (సుమారుగా) 
300 ఎంఎల్‌ తాటి నీరా         రూ. 90 
200 ఎంఎల్‌ తాటి నీరా         రూ. 60 
తాటిబెల్లం (కిలో)                  రూ.1000 
తాటి చక్కెర (కిలో)               రూ. 1050 
తాటి బూస్ట్‌                           రూ. 1100 
తాటి తేనె (లీటర్‌)                రూ.1200 
ఈత బెల్లం (కిలో)                 రూ.900 
ఈత తెనె (లీటర్‌)                రూ.1000 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement