సాక్షి, హైదరాబాద్: కౌన్సెలింగ్ లేకుండా తమకు ఏకపక్షంగా పోస్టింగులు ఇవ్వడంపై పీజీ వైద్యులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను విస్తృతం చేసేందుకు 1,200 మంది పీజీ వైద్యులకు వివిధ ఆస్పత్రుల్లో పోస్టింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2 రోజుల క్రితం 800 మందికి పోస్టింగ్‌లు ఇచ్చింది. సోమవారం నాటికి వారు ఆయాచోట్ల రిపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే, చాలా మంది రిపోర్ట్ చేయలేదని సమాచారం. చాలాచోట్ల కనీస సౌకర్యాలు లేవని, ఈ అంశాన్ని పరిగణించకుండా ఏకపక్షంగా పోస్టింగ్‌లు ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైద్యశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. వసతులు లేనిచోట ఎలా పనిచేస్తామని ప్రశ్నించారు.
(చదవండి: సర్కారు తీరుపై హైకోర్టు అసహనం)
మరోవైపు పీజీ వైద్యుల పోస్టింగ్‌ల విషయంలో ఎలాంటి మార్పులు చేసే ఆలోచన లేదని వైద్య విద్య సంచాలక కార్యాలయం(డీఎంఈ) స్పçష్టం చేస్తోంది. పీజీ వైద్యులు కచ్చితంగా ఏడాది పాటు వారికి కేటాయించిన చోట వైద్య సేవలు అందించాల్సిందేనని, ఈ సమయంలో ప్రతి నెలా వారికి రూ.70వేల వేతనంతో పాటు అదనంగా మరో పది శాతం ఇన్సెంటివ్ ఇస్తున్నామని, క్వారంటైన్ కూడా అమలు చేస్తున్నామని వైద్య విద్య వర్గాలు చెబుతున్నాయి. ఇక పీజీ వైద్యుల పోస్టింగ్స్, ఇతర డిమాండ్లకు సంబంధించి సోమవారం హెల్త్ కేర్ రిఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్.. డీఎంఈకి లేఖ రాసింది. పీజీ వైద్యులకు మ్యూచువల్ బదిలీలకు అవకాశం కల్పించాలని, ప్రెగ్నెన్సీ డాక్టర్లకు మినహాయింపులు ఇవ్వాలని కోరింది.
(ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి తాళం)
Comments
Please login to add a commentAdd a comment