సాక్షి, హైదరాబాద్: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) కేసులో కేంద్ర దర్యాప్తు సంస్త ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. నిజామాబాద్‌లో పీఎఫ్‌ఐపై నమోదైన కేసు ఆధారంగా ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. 11 మంది నిందితులపై నేరారోపణ మోపింది. నిందితులపై 120B, 132A, UA(p)17,18, 18A,18B సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, ఏపీకి చెందిన పలువురిపై ఎన్‌ఐఏ అభియోగాలు మోపింది. శిబిర నిర్వహికుడు అబ్దుల్ ఖాదర్‌తో పాటు మరో 10 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలైంది. ముస్లిం యువకులను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.
భారత ప్రభుత్వం, ఇతర సంస్థలు, వ్యక్తులపై రెచ్చగొట్టే ప్రసంగాలను పీఎఫ్ఐ చేస్తున్నట్లు ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ముస్లిం యువకులను పీఎఫ్ఐ సంస్థలో బలవంతంగా చేర్చుకున్నట్లు పేర్కొంది. పీఎఫ్‌ఐలో రిక్రూట్ అయిన తర్వాత ముస్లిం యువకులను యోగా క్లాసులు, ఫిజికల్ ఎడ్యుకేషన్, బిగినర్స్ కోర్సు ముసుగులో దాడులపై శిక్షణ ఇచ్చినట్లు గుర్తించింది. కత్తి, కొడవలి, ఇనుప రాడ్ల తో ఎలా దాడులు చేయాలో శిక్షణలో నేర్పిస్తున్నట్లు గుర్తించింది.
ఉగ్రవాద సాహిత్యంతో పాటు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. సున్నిత ప్రాంతంలో ఏవిధంగా దాడులు చేయాలో పీఎఫ్‌ఐ శిక్షణ ఇచ్చినట్లు గుర్తించింది. అలాగే మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. దేశ వ్యాప్తంగా దాడులు చేసి పలువురిని విచారించిన ఎన్‌ఐఏ.. పీఎఫ్‌ఐ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా.. ఇప్పటికే పీఎఫ్‌ఐ సంస్థను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.
చదవండి: ఎయిర్‌పోర్ట్ మెట్రో మార్గంలో సోలార్ పవర్!
Comments
Please login to add a commentAdd a comment