సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అన్నివర్గాల భాగస్వామ్యంతో ఏర్పడిందని, తొమ్మిదేళ్లుగా ప్రజలు మోసగించబడుతూ, ఆత్మగౌరవం కోల్పోయారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం జలవిహార్‌లో రేపటి తెలంగాణ ఆకాంక్షల వేదిక అధ్యక్షతన జరిగిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని, ప్రైవేట్ వర్సిటీలను ఏర్పాటు చేసి పేదలకు ఉన్నతవిద్య దూరం చేశారని చెప్పారు.ముప్పైమంది విద్యార్థులకు ఒక టీచర్ పేరుతో దాదాపుగా ఎనిమిదివేల స్కూళ్లను మూసివేశారని, పీహెచ్‌డీ చేసినవారు రూ.5వేలకు పనిచేస్తున్నారని, ఈ పరిస్థితులను చూస్తే రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
దళితబంధు, బీసీలకు లక్ష రూపాయల సహాయం ఓట్ల కోసమేనని, కేసీఆర్‌కు కుర్చీ మీద ఉన్న ప్రేమ, ప్రజల మీద లేదని, పుట్టిన పిల్లలమీద రూ.1.25 లక్షల అప్పు చేసిపెట్టారని చెప్పారు. వచ్చే నెల 6న అన్నివర్గాల సమస్యలను పుస్తకం రూపంలో విడుదల చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, జస్టిస్ నరసింహారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, తేజావత్ రామచంద్రుడు, మాజీ ఐపీఎస్ అధికారులు అరవింద్‌రావు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ప్రతినిధి పేరాల శేఖర్‌రావు, తుర్క నరసింహ, అశ్వథ్వామరెడ్డి, విఠల్, ప్రొఫెసర్ గాలి వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment