Rajendar eetala
-
తొమ్మిదేళ్లుగా తెలంగాణ ఆత్మగౌరవం కోల్పోతోంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అన్నివర్గాల భాగస్వామ్యంతో ఏర్పడిందని, తొమ్మిదేళ్లుగా ప్రజలు మోసగించబడుతూ, ఆత్మగౌరవం కోల్పోయారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం జలవిహార్‌లో రేపటి తెలంగాణ ఆకాంక్షల వేదిక అధ్యక్షతన జరిగిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని, ప్రైవేట్ వర్సిటీలను ఏర్పాటు చేసి పేదలకు ఉన్నతవిద్య దూరం చేశారని చెప్పారు.ముప్పైమంది విద్యార్థులకు ఒక టీచర్ పేరుతో దాదాపుగా ఎనిమిదివేల స్కూళ్లను మూసివేశారని, పీహెచ్డీ చేసినవారు రూ.5వేలకు పనిచేస్తున్నారని, ఈ పరిస్థితులను చూస్తే రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. దళితబంధు, బీసీలకు లక్ష రూపాయల సహాయం ఓట్ల కోసమేనని, కేసీఆర్‌కు కుర్చీ మీద ఉన్న ప్రేమ, ప్రజల మీద లేదని, పుట్టిన పిల్లలమీద రూ.1.25 లక్షల అప్పు చేసిపెట్టారని చెప్పారు. వచ్చే నెల 6న అన్నివర్గాల సమస్యలను పుస్తకం రూపంలో విడుదల చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, జస్టిస్ నరసింహారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, తేజావత్ రామచంద్రుడు, మాజీ ఐపీఎస్ అధికారులు అరవింద్‌రావు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ప్రతినిధి పేరాల శేఖర్‌రావు, తుర్క నరసింహ, అశ్వథ్వామరెడ్డి, విఠల్, ప్రొఫెసర్ గాలి వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
అత్యధిక కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ధి: ఈటల
సాక్షి, హైదరాబాద్: అత్యధిక కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆర్థికమంత్రి ఈటల రాజేం దర్ తెలిపారు. 25,589 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆయా శాఖలల్లో పనిచేస్తున్నట్లు హెచ్ఆర్ఎంఎస్ డేటా ప్రకారం ఇప్పటివరకు వివరాలు వచ్చాయన్నారు. ఉన్నతవిద్యలో 7,434, వైద్యశాఖలో 6,186, పంచాయతీరాజ్‌లో 3,454, సోషల్ వెల్ఫేర్‌లో 1,370 ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలుస్తోందని చెప్పారు. ఖాళీలు ఉన్నచోట నియామకాలు జరిగినవి, 2014 జూన్ 2 కు ముందు సర్వీసులో చేరినవారు, ప్రతినెలా జీతాలు తీసుకుంటున్నవారు, పార్ట్‌టైం జాబ్ చేయనివారు, అనుమతి లేకుండా విధులకు దూరం కాకపోవడం, ఇతరత్రా క్రమశిక్షణ చర్యలు తీసుకోనివారు, రిజర్వేషన్ విధానంలో రోస్టర్ పాయింట్లకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, తదితరులకు ప్రాధాన్యం వంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆరు ముఖ్యమైన అంశాల ప్రాతిపదికన వీటిని చేపడతామని మంత్రి తెలిపారు. మంగళవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కర్నె ప్రభాకర్, గంగాధర్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు విపక్ష నేత షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకరరెడ్డి, ఎన్.రామచంద్రరావు, పాతూరి సుధాకరరెడ్డి, పూల రవీందర్, ఎమ్మెస్ ప్రభాకర్‌రావు వేసిన ఉపప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.