ఇన్‌స్పైర్‌ చేశారు...! | Nizamabad District Students Selected Inspire Manak Award 2020 21 | Sakshi
Sakshi News home page

ఇన్‌స్పైర్‌ చేశారు...!

Published Mon, Jan 4 2021 9:24 AM | Last Updated on Mon, Jan 4 2021 11:52 AM

Nizamabad District Students Selected Inspire Manak Award 2020 21 - Sakshi

జక్రాన్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, శాస్త్రీయ విజ్ఞానాన్ని వెలికి తీసేందుకు ఇన్‌స్పైర్‌ మనక్‌ పేరుతో కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ద్వారా ఏటా పోటీలను నిర్వహిస్తోంది. ఇన్‌స్పైర్‌ మనక్‌పై ఈసారి హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు మనసు పెట్టారు. జిల్లా చరిత్రలో అత్యధికంగా ప్రాజెక్టులు నామినేషన్లకు ఎంపిక చేయబడ్డాయి. దరఖాస్తు ప్రక్రియలో విద్యార్థులకు ఉపాధ్యాయులు తగిన తోడ్పాటు ద్వారా ఈ ప్రగతి సాధ్యమైంది. 

విద్యార్థుల ఎంపిక.. 
కరోనా మహమ్మారి విస్తృతంగా ఉన్న సమయంలో డీఈవో, జిల్లా సైన్స్‌ అధికారి పాఠశాల హెచ్‌ఎంలతో సమావేశం ఏర్పాటు చేసి ఇన్‌సై్పర్‌ మనక్‌ కో సం ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఆయా హెచ్‌ఎంలు పాఠశాలల్లో సైన్స్‌ ఉపాధ్యాయుల సహకారంతో ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించారు. 2020– 2021కు గాను సంబంధించి జిల్లాలో 287పాఠశాలల నుంచి 680 నామినేషన్లు  (ఐడియాస్‌)పంపగా 133 మంది విద్యార్థుల ఐడియాస్‌ను ఎంపిక చేశారు. అత్యధికంగా నిజామాబాద్‌ నార్త్, సౌత్, రూరల్‌ మండలాల నుంచి 22 నామినేషన్లు ఎంపిక చేశారు. బోధన్‌ మండలంలో 13, డిచ్‌పల్లి 16, ఆర్మూర్‌ 16, వేల్పూర్‌  8, భీంగల్‌ 7, బాల్కొండ నుంచి 6 నామినేషన్లు ఎంపికయ్యాయి. కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి ఎంపిక చేసిన విద్యార్థుల ఖాతాల్లో గత వారం రోజుల నుంచి రూ.10 వేల నగదును జమ చేస్తున్నది. 

త్వరలో పోటీల నిర్వహణ 
జిల్లాలో నూతన సంవత్సరంలో జనవరి నెలలో ఇన్‌స్పైర్‌ పోటీలు నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. కానీ కరోనా కారణంగా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. విద్యార్థులకు అందించిన రూ.10వేలలో రూ.5వేలు ప్రాజెక్ట్‌ తయారి కోసం, మరో రూ.5వేలు ప్రయాణ ఖర్చులకు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పోటీలు నిర్వహించే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు తయారీకి రూ.10వేల వరకు వెచ్చించే సౌకర్యం లభించనుంది. 

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు.. 
ఇన్‌స్పైర్‌ మనక్‌ క్రింద మూడు దశలలో ఎంపిక ఉంటుంది. ఎంపికైన నామినేషన్లు జిల్లా స్థాయిలో మొదటగా ప్రదర్శించాలి. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటితే రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో విద్యార్థులకు రూ.40వేలు చెల్లిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు. జాతీయస్థాయిలో ఎంపికైతే రాష్ట్రపతి ద్వారా అవార్డుతో పాటు రూ.60వేలు చెల్లిస్తారు. 

ఎంపికవ్వడం సంతోషంగా ఉంది.. 
ఇన్‌స్పైర్‌ మనక్‌ కోసం నేను తయారు చేసిన సోలార్‌ ప్యానల్‌ ద్వారా హైడ్రోజన్‌ ఇందన తయారీ ప్రాజెక్టు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. మా సైన్స్‌ ఉపాధ్యాయుడు శ్రీధర్‌ సార్‌ సహకారంతో ప్రాజెక్టును తయారు చేశాను.  రాష్ట్ర స్థాయిలో నా ప్రాజెక్టు ఎంపిక కావడమే నా ఏకైక లక్ష్యం.
– శ్రీజ, విద్యారి్థని, జెడ్పీహెచ్‌ఎస్, అంక్సాపూర్‌ 

శాస్త్ర సాంకేతికత పెరుగుతోంది.. 
ఇన్‌సై్పర్‌ మనక్‌ వల్ల విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతికతను పెంపొందిస్తుంది. విద్యార్థుల చేత సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రజల యొక్క జీవితాలను సులభతరం చేసే యంత్రాలను, వస్తువును మెరుగుపరిచే విధంగా కొత్తదాన్ని ఆవిష్కరించే లేదా సృష్టించే విధంగా సొంత ఆలోచనలను పొందపరిచి స్వీకరించే పోటీయే ఇన్‌స్పైర్‌ అవార్డు మనక్‌. వేల్పూర్‌ మండలంలో 8 ప్రాజెక్టులు ఎంపికయ్యాయని తెలిపారు. 
– వనాజారెడ్డి, ఎంఈవో, వేల్పూర్‌ 

నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలు..
సమాజంలో ముందుగా మూఢ విశ్వాసాలను విడనా డాలి. విద్యార్థులు శాస్త్రబద్దంగా ఆలోచించి సమస్యలకు పరిష్కారమార్గాలను కనుగొనాలి. ట్రెడిషనల్‌ ప్రాక్టీసెస్‌కు తోడు ఆధునిక శాస్త్రీతయను జోడించి ఎ ప్పటికప్పుడు ఫలితాలను రాబట్టే దిశగా మనం ఆలోచించాలి. నేటి బాలలు రేపటి శాస్త్రవేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఉంది. వివిధ రంగాల్లో ఎదురవుతున్న సమస్యలకు ఎప్పటికప్పుడు శాస్త్రీయంగా ఆలోచించి పరిష్కరించుకోవచ్చు.    – గంగా కిషన్, జిల్లా సైన్స్‌ అధికారి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement