రైలుబండెక్కి వచ్చెత్త పా..! ముప్పై ఏళ్లుగా నిరాటంకంగా.. | Nizamabad Kamareddy People Special Bonding With Devagiri Express To Go Mumbai | Sakshi
Sakshi News home page

రైలుబండెక్కి వచ్చెత్త పా..! ముప్పై ఏళ్లుగా నిరాటంకంగా..

Published Sun, Mar 6 2022 8:29 PM | Last Updated on Sun, Mar 6 2022 8:46 PM

Nizamabad Kamareddy People Special Bonding With Devagiri Express To Go Mumbai - Sakshi

బతుకుదెరువు కోసం తెలంగాణ పల్లెల నుంచి ముంబయికి వలసలు కొత్తకాదు. దశాబ్దాల కాలంగా ముంబయి నగరం ఎందరికో బతుకునిచ్చింది. ఇప్పటికీ ఎందరో వెళుతుంటారు. అప్పట్లో అక్కడకు వెళ్లాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చాల్సి వచ్చేది. బస్సుల్లో అవస్థల ప్రయాణం ఆపై అడ్డగోలు చార్జీలు చెల్లించాల్సి వచ్చేది. అయితే సికింద్రాబాద్‌ నుంచి కామారెడ్డి, నిజామాబాద్‌ మీదుగా రైలు నడపడంతో ఈ ప్రాంత ప్రజలకు ముంబయి వెళ్లి రావడం సులువైంది. మూడు దశాబ్దాల నాడు అంటే 1992లో ‘దేవగిరి’ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ముంబయికి రైలు మొదలైంది. ముప్పై ఏళ్లుగా నిరాటంకంగా నడుస్తోంది.

మొన్నామధ్య లాక్‌డౌన్‌ సమయంలో కొంతకాలమే రైలు నిలిచింది. తరువాత యథావిధిగా నడుస్తోంది. కాగా తెలంగాణ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వేల కుటుంబాలు ముంబయిలో స్థిరపడ్డాయి. అలాగే ఉన్నత చదువుల కోసం, ఉద్యోగరీత్యా వెళ్లినవారూ ఉన్నారు. బంధుత్వాలు కూడా ఉన్నాయి. దీంతో అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. ఇలా ముంబయితో ఎంత అనుబంధం ఉందో, దేవగిరి ఎక్స్‌ప్రెస్‌తోనూ ప్రజలకు అంతే అనుబంధం 
పెరిగింది. 
 – సాక్షి, కామారెడ్డి

రైలు ఆగేచోటల్లా ఎక్కేస్తారు.. 
సికింద్రాబాద్‌ నుంచి ముంబయికి 878 కిలోమీటర్లు దూరం కాగా, దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ దాదాపు 17 గంటల నుంచి 18 గంటల పాటు నడుస్తుంది. సికింద్రాబాద్‌తో పాటు మెదక్‌ జిల్లాలోని మిర్జాపల్లి, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముథ్కేడ్, నాందేడ్‌ స్టేషన్ల మీదుగా రైలు ముందుకు సాగుతుంది. కాగా కామారెడ్డి రైల్వే స్టేషన్‌ సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లా వాసులకు అందుబాటులో ఉంటుంది. దీంతో ముంబయి వెళ్లేవారంతా కామారెడ్డికి వచ్చి రైలు ఎక్కి వెళతారు. ముంబయి నుంచి వచ్చే వారు కూడా కామారెడ్డి స్టేషన్‌లో దిగి ఇక్కడి నుంచే సొంతూళ్లకు వెళతారు. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ వచ్చిందంటే చాలు కనీసం వంద మంది దిగుతారు. 

రోజూ వెయ్యి మందికి పైగా.. 
దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో 20 బోగీలు ఉండగా, అందులో రెండు మూడు మాత్రమే జనరల్‌ బోగీలు కాగా, మిగతావి రిజర్వేషన్‌వి. ముంబయి వెళ్లేవారంతా రిజర్వు చేసుకుని వెళతారు. దాదాపు వెయ్యి మంది రిజర్వేషన్‌ చేయించుకుని ప్రయాణం చేస్తుండగా, ఇతర స్టేషన్లు దిగేందుకు, జనరల్‌ బోగీల్లో మరో వెయ్యి మంది వరకు వెళతారని అంచనా. కామారెడ్డి, నిజామాబాద్‌ రైల్వే స్టేషన్ల ద్వారా ముంబయి నగరానికి ప్రతిరోజూ కనీసం వంద మంది వెళ్లినా సంవత్సరానికి 30 వేల మంది వెళుతుంటారు. ముప్‌పై ఏళ్ల కాలంలో పది లక్షల మంది వెళతారు. తిరుగు ప్రయాణంలో కూడా అదే స్థాయిలో వస్తుంటారు. ఈ లెక్కన మూడు దశాబ్దాల కాలంలో దాదాపు 20 లక్షల మంది తిరిగినట్టు అంచనా. 

దేవగిరితో ఎంతో అనుబంధం.. 
మూడు దశాబ్దాలుగా నడుస్తున్న దేవగిరితో ఈ ప్రాంత ప్రజలకు అనుబంధం ఏర్పడింది. రైల్లో ఏ నంబరు బోగీ ఎక్కడ వస్తుందో ఇట్టే చెప్పేస్తుంటారు. రిజర్వేషన్‌ చేసుకోవడం, బెర్త్, టూ టైర్‌ ఏసీ, త్రీటైర్‌ ఏసీ తదితర రిజర్వేషన్ల గురించి కూడా చాలా మందికి అవగాహన కలిగింది. కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, లింగంపేట, రామారెడ్డి, సదాశివనగర్, బీబీపేట, మెదక్‌ జిల్లాలోని రామాయంపేట, మెదక్, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్‌ తదితర ప్రాంతాలకు చెందిన వందలాది కుటుంబాలు ముంబయిలో స్థిరపడ్డాయి. కొందరైతే నెలకోసారైనా సొంతూళ్లకు వచ్చి వెళుతుంటారు. పెళ్లిళ్ల సీజన్‌ ఉందంటే చాలు బంధువుల పెళ్లిళ్ల కోసం ముల్లేమూటలతో వచ్చి వారం, పదిరోజులు ఉండి వెళతారు. పండుగల సమయంలో కూడా వచ్చి వెళ్తారు. దీంతో దేవగిరితో ఆ కుటుంబాలకు అవినాభావ సంబంధం ఏర్పడింది. 

పదేళ్లుగా..
మాకు ముంబయిలో వ్యాపా రాలున్నాయి. మా అమ్మా, నాన్న అక్కడే ఉంటారు. నేను కూడా చాలా కాలం అక్కడే ఉండేవాన్ని. పదేళ్లుగా ఇక్కడికి వచ్చి ఉంటున్నా. వందల సార్లు దేవగిరిలో ముంబయికి వెళ్లాను. మాకు ముంబయికి ఎంత అనుబంధమో, దేవగిరికి కూడా అంతే అనుబంధం ఉంది.
–రాఘవేందర్, వ్యాపారి, కామారెడ్డి 

రెగ్యులర్‌గా  వెళతాం 
దుస్తుల కొనుగోళ్ల కోసం ముంబయికి ప్రతీసారి దేవగిరిలోనే వెళతాం. తిరిగి రావడం కూడా అదే రైలులోనే.  ఏళ్ల తరబడిగా అందులో ప్రయాణిస్తున్నాం. దేవగిరి రైలు కామారెడ్డి ప్రాంత ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉంది. ఉదయం కల్లా ముంబయిలో దిగి పనులు చేసుకుని, తిరిగి రాత్రి రైలెక్కుతాం.
-  సుధాకర్, వ్యాపారి, కామారెడ్డి  

ముంబయి తొవ్వలో దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ ∙మూడు దశాబ్దాలుగా సేవలు ∙ఉమ్మడి జిల్లావాసులకు అనుకూలం ∙రైలుతో విడదీయలేని అనుబంధం

ముంబయికి వెళ్లేందుకు దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైల్‌లో 
ఎక్కుతున్న ప్రయాణికులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement