
బంజారాహిల్స్: సీఏం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోవాలంటే.. హైదరాబాద్‌లో నిజాం జ్యువెలరీ మ్యూజియం నిర్మించాలని ప్రిన్స్ మోజంజాహ్ మనవడు హిమాయత్ అలీ మీర్జా అన్నారు. రూ.99వేల కోట్ల విలువ చేసే నిజాం జ్యువెలరీ హైదరాబాద్‌కు రావాలంటే ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని మషెల్లా మంజిల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిజాం జ్యువెలరీ మ్యూజియం నిర్మించాలని తాను ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశానని తెలిపారు. ప్రస్తుతం నిజాం ఆభరణాలు ఆర్బీఐ కస్టడీలో ఉన్నాయని.. వాటిని హైదరాబాద్ తరలించాలని 4 నెలల క్రితం ప్రధానమంత్రి మోదీకి తాను లేఖ రాశానన్నారు. అందుకు ప్రధాని సుముఖత చూపుతూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేశారన్నారు. అందుకే... రాష్ట్ర ప్రభుత్వం భద్రతతో కూడిన మ్యూజియం నిర్మించి ఇస్తే వెంటనే తరలిస్తామని కిషన్‌రెడ్డి ఇటీవల హామీ ఇచ్చారని చెప్పారు.
నిజాంకు సంబంధించిన 2 వేల ఎకరాల భూములు 70ఏళ్లుగా హైదరాబాద్ చుట్టుపక్కల నిరుపయోగంగా ఉన్నాయని.. ఆ వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తానని, అనువైన స్థలం ఎంపిక చేసి అక్కడ మ్యూజియం నిర్మించాలని అన్నారు. ఈ మ్యూజియం నిర్మాణంతో సీఎం కేసీఆర్ ప్రతిష్ట పెరుగుతుందని, సుమారు 10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. దీనివల్ల పర్యాటకంగానూ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా నిజాం భూములను స్వాధీనం చేసుకొని మ్యూజియం నిర్మించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment