![No decision has been taken on EAMCET in Telangana - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/12/JEE-ONLINE.jpg.webp?itok=ZeIoNJRS)
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 13న జరగాల్సిన ఈసెట్ పరీక్షను వాయిదా వేస్తున్నామని, ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అయితే 14న జరగాల్సిన ఎంసెట్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న వర్ష బీభత్స పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష జరిపామని చెప్పారు. వర్షాలు తగ్గని పక్షంలో ఎంసెట్ కూడా వాయిదా తప్పదని, దీనిపై మంగళవారం వరకూ వేచి చూస్తామని అన్నారు. అయితే దీనిపై బుధవారం నిర్ణయిద్దామని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ఉన్నత విద్యామండలికి తెలిపినట్లు సమాచారం.
ఈ నెల 14, 15 తేదీల్లో ఎంసెట్ మెడికల్, అగ్రికల్చర్ విభాగం పరీక్ష జరగాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎంసెట్ మెడికల్ విభాగం ప్రవేశ పరీక్షనైనా వాయిదా వేస్తే మంచిదని ఉన్నత విద్యా మండలి భావించింది. ఇదే విషయమై సోమవారం ఉన్నతాధికారులు చర్చించారు. అయితే, ఎంసెట్ విభాగానికి ఐటీ కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్న సంస్థ వాయిదాపై సాంకేతిక పరమైన కారణాలు లేవనెత్తింది. తాము జాతీయ స్థాయి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఎంసెట్ తేదీలను ఖరారు చేశామని, ఇప్పుడీ పరీక్ష వాయిదా వేస్తే, మళ్లీ తేదీలను సెట్ చేయడం కష్టమని తెలిపింది.
ఈ నేపథ్యంలో మండలి ఉన్నతాధికారులు తర్జనభర్జనలో పడ్డారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో వర్షాలు ఇలాగే ఎడతెరిపి లేకుండా ఉంటే, ఎంసెట్ నిర్వహణ కష్టమేనని ప్రభుత్వ వర్గాలూ భావిస్తున్నాయి. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో పరీక్షలు నిర్వహిస్తే, వానల కారణంగా అనుకోని ఘటనలు జరిగితే ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడినట్టు తెలిసింది. కన్సల్టెన్సీ సంస్థ మాటలు నమ్మి ఈ పరిస్థితుల్లో ఎంసెట్ నిర్వహించడం సరికాదని ఆయన కరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. అయితే, వర్షాలు ఇదే స్థాయిలో ఉంటే బుధవారం ఎంసెట్ పరీక్షపైనా నిర్ణయం తీసుకుందామని మండలి అధికారులకు సీఎంవో తెలిపినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment