Telangana: రెండేళ్లుగా జాబ్‌ ప్రకటనల్లేవ్‌ | No Job Notifications In Telangana Tspsc From Last Two Years | Sakshi
Sakshi News home page

Telangana: రెండేళ్లుగా జాబ్‌ ప్రకటనల్లేవ్‌

Published Sat, Nov 6 2021 1:50 AM | Last Updated on Sat, Nov 6 2021 1:52 AM

No Job Notifications In Telangana Tspsc From Last Two Years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) డీలా పడింది. కొత్తగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో ఎటూ పాలుపోలేని స్థితిలో ఉంది. దాదాపు రెండేళ్లుగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయలేదు. నూతన జోనల్‌ విధానం అమలు తర్వాత పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించక పోవడంతో కొత్త నోటిఫికేషన్లు జారీ చేయలేదు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన టీఎస్‌ పీఎస్సీ.. నోటిఫికేషన్ల విడుదల నుంచి దరఖాస్తు ప్రక్రియ, హాల్‌టికెట్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనతో పాటు ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకొచ్చి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవ డంతో స్తబ్దుగా ఉంది. మరోవైపు ఉద్యోగాల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) చేసుకున్న 24.62 లక్షల మంది అభ్య ర్థులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

జాడలేని జంబో ఉద్యోగ ప్రకటన...
రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో దాదాపు 50 వేల ఉద్యోగ ఖాళీలను గుర్తించింది. వీటికి ఒకేసారి భర్తీ ప్రకటన వేస్తారనే ప్రచారం సైతం జరిగింది. ఇది జరిగి ఆర్నెళ్లు కావస్తున్నా ఇప్పటికీ కొత్త కొలువుల జాడలేదు. కొత్తగా ఉద్యోగ ప్రకటనలు వస్తాయనే ఆశతో ఇప్పటికే అభ్యర్థులు కోచింగ్‌కు సిద్ధమయ్యారు. మరోవైపు ఒకేసారి ఉద్యోగ ప్రకటనలు వెల్లడించాల్సి వస్తే సంసిద్ధంగా ఉండేలా టీఎస్‌పీఎస్సీ సైతం ఏర్పాట్లు చేసుకుంది. కానీ, ఈ ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రానట్లు సమాచారం. దీంతో ఉద్యోగ ప్రకటనల జారీలో జాప్యం అవుతోంది. టీఎస్‌పీఎస్సీ ఏర్పాటై ఏడేళ్లు కావస్తోంది. తొలి చైర్మన్‌ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో దాదాపు 39వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయగా.. ఇందులో 35 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగిసింది. మిగతా వాటి ప్రక్రియ వివిధ దశల్లో ఉంది.

కొత్త కోరం వచ్చి ఆర్నెళ్లు...
కొత్త కోరం ఏర్పాటై ఆర్నెళ్లు గడిచినా ఇప్పటికీ ఒక్క ప్రకటన విడుదల చేయలేదు. నూతన ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతులు వచ్చిన తర్వాతే టీఎస్‌పీఎస్సీలో హడావుడి మొదలు కానుంది. ప్రభుత్వం నుంచి ఉద్యోగాల భర్తీకి సంబంధించి తమకు ఏదైనా సమాచారం ఇస్తే.. దానికి అనుగుణంగా కేలెండర్‌ ప్రారంభించడానికి వీలవుతుందని, అలా కాకుండా అన్నీ ఒక్కసారే ఇవ్వాలంటే ఇబ్బందులు ఎదురవుతాయని టీఎస్‌పీఎస్సీ వర్గాలు తెలిపాయి. 

టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఒన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులు: 24,62,032
పురుషులు: 14,71,205 
మహిళలు: 9,90,827

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement