సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సల్‌తోపాటు ఏపీ, తెలంగాణ నాయకులను ఈడీ పిలిపించి విచారించిందని, ఏడాదిన్నరగా ఈ కేసు విచారణ ఏమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీకి మధ్య అవగాహన కుదిరినందు వల్లే ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులను ఈడీ విచారణకు పిలవడం లేదా అని అనుమానం వ్యక్తం చేశారు.
‘కాంగ్రెస్ ఒక రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటూ మరో రాష్ట్రంలో వారితో కొట్లాడుతారు. ఒక దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీతో కొట్లాడుతారు. మరోచోట ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. ఇలా బహుళ రాష్ట్రాల్లో బహుళ విధానాలను కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తోంది’అని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్త అదానికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతూ ఇతర రాష్ట్రాల్లో ఆయనను వ్యతిరేకిస్తున్నారని ఎండగట్టారు.
రాజకీయ టూరిస్టులను తాము స్వాగతిస్తామని, సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనడానికి వస్తున్నా రాహుల్, సోనియా హైదరాబాదీ బిర్యానీ తిని హ్యాపీగా వెళ్లిపోవాలని, కానీ మోసపూరిత వైఖరితో తెలంగాణ ప్రజానీకాన్ని మధ్యపెట్టవద్దని సూచించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి తొమ్మిది అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీకి రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి సోనియాగాంధీ ఎందుకు ప్రస్తావించలేదని కవిత ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment