సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలోని పలువురు ఐపీఎస్ అధికారులు ఏళ్ల తరబడి ఎలాంటి కచ్చితమైన విధులు లేకుండా, పోస్టింగుల్లేకుండా కాలం వెళ్లదీస్తున్న వైనం విస్మయానికి గురిచేస్తోంది. ఇలా మొత్తం 47 మంది ఐపీఎస్ అధికారులు వెయిటింగ్ / అటాచ్‌మెంట్ పేరుతో ఎలాంటి ఉద్యోగం, బాధ్యత లేకుండా గడిపేస్తున్నారు. ఏదో ఒక విభాగానికి అటాచ్ అయిన కొందరికి జీతభత్యాలు అందుతున్నా, పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్నవారి పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. ఎప్పుడు శాశ్వత పోస్టింగ్ వస్తుందో తెలియని పరిస్థితుల్లో వీరంతా తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నట్టు పోలీసు అధికారులే చెబుతుండటం గమనార్హం.
అసలు ఎందుకు ఐపీఎస్ అధికారులయ్యామో తెలియని దుస్థితిలో ఉన్నామంటూ అదనపు ఎస్పీ, ఏఎస్పీ స్థాయిలో ఉన్న కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పదోన్నతి పొందినా పరిస్థితి మారకపోవడం మానసికంగా కుంగుబాటుకు కారణమవుతోందని చెబుతున్నారు. సీనియర్ ఐపీఎస్‌ల పరిస్థితి ఇలా ఉంటే శిక్షణ పూర్తి చేసుకున్న యువ ఐపీఎస్‌ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పాసింగ్ ఔట్ పరేడ్ తర్వాత ప్రజల్లోకి వెళ్లాల్సిన వారిని అటాచ్‌మెంట్ పేరుతో మూడేళ్లుగా గ్రేహౌండ్స్‌లోనే కొనసాగించడం వివాదాస్పదమవుతోంది.
ఏళ్ల తరబడి ఒకే పోస్టులో..
► కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏళ్ల తరబడి ఒకే పోస్టులో కొనసాగుతున్న వైనం కూడా విస్మయపరుస్తోంది.
► సీనియర్ ఐపీఎస్‌గా ఉన్న అదనపు డీజీపీ నాగిరెడ్డి, ప్రస్తుతం నార్త్‌జోన్ ఇన్‌చార్జి ఐజీగా ఆరేళ్ల నుంచి కొనసాగుతున్నారు.
► అదనపు డీజీపీ సంజయ్‌కుమార్ జైన్, ప్రొవిజనల్ అండ్ లాజిస్టిక్ ఐజీగా జూన్ 6, 2015 నుంచి కొనసాగుతున్నారు. పదోన్నతి వచ్చినా ఆయనకు మరోచోట పోస్టింగ్ ఇవ్వకుండా అవే బాధ్యతల్లో కొనసాగింపజేస్తున్నారు.
► బి.శివధర్‌రెడ్డి, అదనపు డీజీపీ. ఈయన ఐజీ హోదాలో సెప్టెంబర్, 2016లో పోలీస్ శాఖ పర్సనల్ విభాగం బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఆరేళ్లు పూర్తిచేసుకొని పదోన్నతి పొందినా ఇంకా అక్కడే కొనసాగుతున్నారు.
► కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అదనపున డీజీపీ. మార్చి, 2017 నుంచి గ్రేహౌండ్స్ ఐజీ. ప్రస్తుతం పదోన్నతి పొంది అక్కడే అదనపు డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
► ఐజీ సుధీర్‌బాబు ప్రస్తుతం రాచకొండ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డీఐజీ హోదాలో మార్చి, 2018లో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఐజీగా పదోన్నతి కల్పించినా ఇంకా అక్కడే అదనపు కమిషనర్‌గా ప్రభుత్వం కొనసాగిస్తోంది.
► ఐజీ రాజేష్‌కుమార్ 2016, జూన్ 30వ తేదీ నుంచి ఇంటెలిజెన్స్ విభాగంలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డీఐజీ నుంచి ఐజీ అయినా ఆరేళ్లుగా పాత పోస్టులోనే కొనసాగుతున్నారు.
► చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రస్తుతం ఐజీ. ఈయన పరిస్థితి మరీ విచిత్రం. ఐజీ హోదా ఉన్నప్పటికీ ఎస్పీ హోదా కలిగిన రామగుండం కమిషనర్ పోస్టులో పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడింది. 10 నెలలుగా ఆయన ఈ విధంగా విధులు నిర్వర్తిస్తున్నారు.
కుర్చీలో ఖాళీగా..
ఐపీఎస్ అధికారికి పక్కా పోస్టింగ్ కల్పిస్తేనే పూర్తి స్థాయిలో బాధ్యత నిర్వహణ సాధ్యమవుతుంది. కానీ రాష్ట్ర పోలీస్ శాఖలో ఓ పద్ధతి లేకుండా పోయింది. వెయిటింగ్/అటాచ్‌మెంట్ అనే పేరుతో ఏదో ఒక విభాగంలో కుర్చీ ఇచ్చి ఖాళీగా కూర్చోబెడుతున్నారు. అటాచ్‌మెంట్‌పై ఉన్న అధికారులు ఏదైనా పనిచేయడానికి కానీ, ఏదైనా విషయంలో సొంతంగా నిర్ణయం తీసుకోవడం గానీ, ఆదేశాలివ్వడం గానీ, పరిపాలన చేయడం గానీ ఉండదు.
ఈ పరిస్థితుల్లోనే అధికారులు తీవ్ర నిరాశానిస్పృహలకు గురవుతున్నారు. 2017లో ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న యువ అధికారులను సైతం అటాచ్‌మెంట్ పేరుతో పోలీస్ శాఖ కొనసాగించడం ఏమిటో అర్ధం కావడం లేదని సీనియర్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమయంలో అదనపు డీజీపీలు, ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు పదోన్నతులు పొందినా ఇంకా పాత పోస్టింగ్‌ల్లోనే కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment