తెలంగాణ ఉద్యమానికి గాంధే స్ఫూర్తి: సీఎం కేసీఆర్‌ | Non-Violence Inspiration To Telangana Movement Says TS CM KCR | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యమానికి గాంధే స్ఫూర్తి: సీఎం కేసీఆర్‌

Published Sat, Mar 13 2021 1:44 AM | Last Updated on Sat, Mar 13 2021 8:31 AM

Non-Violence Inspiration To Telangana Movement Says TS CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఇరవై ఏళ్ల కిందట తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు మహాత్ముడి అహింసాపూరిత స్వాతంత్య్ర ఉద్యమ పంథానే స్ఫూర్తిగా నిలిచింది’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మహాత్మాగాంధీ అహింసనే ఆయుధంగా చేసుకుని ఉద్యమాన్ని ప్రారంభిం చినప్పుడు ఆయన అనుచరుల్లోని కొందరు ఉద్రేకపరులు నిరాశ చెందారని, అదే తరహాలో తెలంగాణ ఉద్యమం తీరుపై కూడా కొందరు సంశయాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. చివరకు దేశ స్వాతంత్య్ర ఉద్యమం గొప్ప విజయాన్ని సాధించి ఇప్పుడు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు కారణమైందని, అదే తరహాలో తెలంగాణ ఉద్యమం కూడా గొప్ప విజయం సాధించిందన్నారు.



భారత జాతికి స్వేచ్ఛను ప్రసాదించిన స్వాతత్య్ర ఉద్యమ స్ఫూర్తిని మరవకుండా మరో సారి మననం చేసుకునే గొప్ప అవకాశంగా వచ్చిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రారంభమైన ఈ ఉత్సవాలు 75 వారాలపాటు సాగుతున్నందున రాజకీయాలు, పార్టీలకతీతంగా అందరూ పాల్గొని ప్రపంచానికే ఉద్యమ పంథాను నేర్పిన మన స్వాతంత్య్రోద్యమ ఔన్నత్యాన్ని మరో సారి గుర్తుచేసుకుని ముందుకు సాగాలని సూచించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ను సీఎం కేసీఆర్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌ వేడుకల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు కేవీ రమణాచారి ప్రారంభోపన్యాసం చేశారు. ఒగ్గుడోలు, కొమ్ముబూర కళాకారులు చివరలో సందడి చేశారు. సమావేశంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

గాంధీకి ముందు.. ఆ తరవాత..
ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ‘‘మన స్వాతంత్య్ర ఉద్యమాన్ని గాంధీకి ముందు.. గాంధీ తర్వాత అని పేర్కొనచ్చు. మహాత్ముడు ఉద్యమంలో కాలుమోపక ముందే ఎంతో మంది పోరాట పంథాను ఎంచుకున్నారు. కానీ గాంధీ వచ్చి ఉద్యమానికి నేతృత్వం వహించిన తర్వాత రగిలిన స్ఫూర్తే వేరు. ఆయన ఆధ్వర్యంలో అద్భుత ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయి. ఆహింసే ఆయు« దంగా సాగిన ఆ ఉద్యమంపై ప్రారంభంలో కొంత మందిలో సందేహాలు వెల్లువెత్తాయి. ఆయన అనుచరుల్లోని ఉద్రేకపరులు కూడా సందేహపడ్డారు. కానీ వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ అద్భుత ఫలితాన్ని ఆయన పంథా అందుకుంది. చివరకు ప్రపంచానికే ఆయన ఉద్యమ స్ఫూర్తి ఆదర్శవంతమైంది. అమెరికాలో మానవ హక్కుల కోసం పోరాడిన మార్టిన్‌ లూదర్‌ కింగ్‌కు కూడా ఆయన ఆదర్శంగా నిలిచారు’’అని కొనియాడారు.

ఉత్సవాలకు రూ. 25 కోట్లు..
ఇప్పుడు మొదలైన ఈ వేడుకలు వచ్చే ఆగస్టు 15 నుంచి తదుపరి పంద్రాగస్టు వరకు కొనసాగుతాయి. అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధు లు, ఇతర నేతలు, ప్రజలు పార్టీలు రాజకీయాలకతీతంగా వీటిల్లో పాల్గొనాలి. ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఆధ్వర్యంలో నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశాం. ఉత్సవాలకు రూ. 25 కోట్లు మం జూరు చేశాం. దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించా లని కేంద్రం నిర్ణయించింది. అదే రీతిలో రాష్ట్రంలో నిర్వహిస్తాం. నేను కూడా పలు చోట్ల కార్యక్రమాల్లో పాల్గొంటా. జాతి స్వేచ్ఛను ప్రసాదించిన ఉద్యమ స్ఫూర్తిని మరువకుండా ఇది పునఃశ్ఛరణగా ఉపయోగపడుతుంది’’ అని సీఎం పేర్కొన్నారు.

మీరు చప్పట్లు కొట్టాలి..
దేశంలో బ్రిటిష్‌ పాలన అంతానికి ఉప్పు సత్యాగ్రహం ఓ సంకేతమని గాంధీజీ పేర్కొనడాన్ని సీఎం కేసీఆర్‌ వివరించే సందర్భంలో సభికులు మౌనంగా ఉండటంతో.. అది చప్పట్లు కొట్టాల్సిన సందర్భమని సీఎం గుర్తు చేశారు. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement