
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా స్థానాలకు ఎన్నిక జరపడంపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆరుగురు సభ్యుల పదవీ కాలం జూన్ 3న ముగిసింది. ఈ ఏడాది మేలో ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా, కోవిడ్ రెండో దశ తీవ్రతతో వాయిదా వేస్తున్నట్లు మే 13న సీఈసీ ప్రకటించింది. ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని సీఈసీ భావిస్తోంది. ప్రభుత్వం నుంచి అందే సమాధానం ఆధారంగా ఎన్నిక నిర్వహణపై సీఈసీ నిర్ణయం తీసుకోనుంది. శుక్రవారం ఎన్నిక నోటిఫికేషన్ వెలువడనుందని సమాచారం.
ఎమ్మెల్యే కోటాలో ఆరు స్థానాలు ఖాళీ
ఈ ఏడాది జూన్ 3న పదవీ విరమణ చేసిన ఎమ్మెల్సీల్లో మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరితో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఆకుల లలిత పదవీకాల పరిమితి పూర్తి చేసుకున్న వారిలో ఉన్నా రు. వీరితో పాటు గవర్నర్ కోటాలో ఎన్నికైన ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలం కూడా గత నెల 17న ముగిసింది. ప్రస్తుతం శాసనసభలో ఎమ్మెల్యే కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒక స్థానం చొప్పున మొత్తం ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment