సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి అర్హులైన ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగినా, ఆ మేరకు ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోక పోవడంతో పోలింగ్ శాతం తగ్గింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3,26,02,793 మంది ఓటర్లకు గాను 2,32,59,256 మంది (71.34%) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1,62,98,482 మంది పురుషులకు గాను 1,15,84,728 మంది, 1,63,01,634 మంది మహిళలకు గాను 1,16,73,722 మంది, 2,677 మంది థర్డ్ జెండర్ ఓటర్లకు గాను 806 మంది ఓటేశారు. గురువారం నాటి పోలింగ్‌కు సంబంధించిన తుది గణాంకాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) శుక్రవారం రాత్రి విడుదల చేశారు.
అత్యధికంగా మునుగోడులో 91.89 శాతం పోలింగ్ నమోదు కాగా..పాలేరు (90.89 శాతం), ఆలేరు (90.77 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అత్యల్పంగా యాకుత్‌పురలో 39.64 శాతం నమోదైంది. మలక్‌పేట (41.32 శాతం), చారి్మ నార్ (43.27 శాతం) ఆపై స్థానాల్లో ఉన్నాయి. ఈ సారి ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు అధిక సంఖ్యలో ఓటేయడం గమనార్హం. కాగా 2018లో జరిగిన ఎన్నికల్లో 73.2 శాతం పోలింగ్ నమోదైంది.
ఈ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుత ఎన్నికల్లో 1.86 శాతం పోలింగ్ తగ్గింది. 2018 ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో మొత్తం 2.8 కోట్ల మంది ఓటర్లుండగా, 2.05 కోట్ల మంది ఓటేశారు. అయితే ఈసారి ఓటర్ల సంఖ్య భారీగా పెరిగి 3.26 కోట్లకు చేరుకోగా, 2.32 కోట్ల మందే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ కారణంగానే.. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం 26.78 లక్షల మంది ఎక్కువగా ఓటేసినా, పోలింగ్ శాతం మాత్రం తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment